కేంద్ర ప్రభుత్వం పీఎం శ్రీ పేరుతో నూతన స్కూళ్లను కొత్తగా ఏర్పాటు చేసేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దేశవ్యాప్తంగా 14,500 పాఠశాలలు కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర/కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వం నిర్వహించే ప్రస్తుత పాఠశాలల నుండి ఎంపిక చేయబడతాయన్నారు. దీని ద్వారా 18 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం కలగనుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నడిపే పాఠశాలల నుంచి పీఎం శ్రీ స్కూల్స్ ఎంపిక చేస్తారు. ఐదేండ్లలో రూ.27,360 కోట్లు ఖర్చు చేయాలని నిర్ణయించింది. ఇందులో కేంద్రం వాటా రూ.18,128 కోట్లుగా ఉంది. నూతన జాతీయ విద్యా విధానం అమలులో వీటిని ఆదర్శంగా తీర్చిదిద్దాలని సంకల్పించింది.
ఈ పాఠశాలల్లో అవలంబించే బోధనా విధానం మరియు అనుభవపూర్వకంగా, సంపూర్ణంగా, సమగ్రంగా, ఆట/బొమ్మల ఆధారితంగా, విచారణ-ఆధారితంగా, ఆవిష్కరణల-ఆధారితంగా, అభ్యాసకుల-కేంద్రీకృతంగా, చర్చ-ఆధారితంగా ఏర్పాటు చేస్తామని తెలిపారు. దీని వల్ల 21వ శతాబ్దంలోని భవిష్యత్ భారత్‌కు అవసరమయ్యే విధంగా రేపటి తరాలను తయారు చేసుకొవడమే దీన్ని లక్ష్యమన్నారు.
పీఎం శ్రీ పాఠశాలలు జాతీయ విద్యా విధానం 2020లోని అన్ని భాగాలను ప్రదర్శిస్తాయి మరియు ఆదర్శవంతమైన పాఠశాలలుగా పనిచేస్తాయన్నారు. పీఎం శ్రీ పాఠశాల సమీపంలోని ఇతర పాఠశాలలకు మార్గదర్శకత్వాన్ని కూడా అందిస్తాయని కేంద్ర విద్యా శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.