గాంధీ ఆస్పత్రిలో కోవిడ్ సేవలు అద్భుతంగా అందించారు. 84,187 మంది కోవిడ్ బాధితులకు వైద్యం అందించారని సిబ్బందిని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ప్రశంసించారు. ఈ రోజు ఉదయం సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో సీటీ స్కాన్ సేవలను మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కొవిడ్ చికిత్స విషయంలో ప్రయివేటు ఆస్పత్రులు చేతులు ఎత్తేస్తే.. గాంధీకి వచ్చిన రోగులకు పునర్జన్మ కల్పించారు. ఈ ఘనత గాంధీ ఆస్పత్రి సిబ్బందికే దక్కుతుందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గాంధీ ఆస్పత్రికి రూ. 176 కోట్ల మంజూరు చేశాం. ఇప్పటి వరకు రూ. 100 కోట్ల పనులు పూర్తయ్యాయి. మిగిలిన పనులను యుద్ధప్రతిపాదికన పూర్తి చేస్తామని హరీష్ రావు ప్రకటించారు. గాంధీలో అత్యాధునికమైన పరికరాలను ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. గాంధీ ఆవరణలో 200 పడకల ఎంసీహెచ్ ఆస్పత్రి త్వరలోనే అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. నాలుగైదు నెలల్లోనే పూర్తి చేస్తామని హరీశ్‌రావు తెలిపారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 4 కోట్ల 6 లక్షల మంది వ్యాక్సినేషన్ వేసుకున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు వంద శాతం వ్యాక్సినేషన్‌ను పూర్తి చేయడానికి శ్రమిస్తున్నారు. ఒమిక్రాన్ కేసులు తెలంగాణలో నమోదు కాలేదు. దాదాపు 11 హైరిస్క్ దేశాల నుంచి 3,235 మంది హైదరాబాద్‌కు వచ్చారు. వీరికి పరీక్షలు చేయగా 15 మంది కరోనా పాజిటివ్ వచ్చింది. వీరి శాంపిళ్లను పరీక్షిస్తే 13 మందికి ఒమిక్రాన్ నెగిటివ్ వచ్చింది. మరో ఇద్దరి ఫలితాలు రావాల్సి ఉంది. కరోనా టెస్టులు కూడా పెంచుతున్నాం. రాబోయే రోజుల్లో జిల్లాల్లో టెస్టుల సంఖ్య పెంచుతామన్నారు. మాస్కు ఒక్కటే శ్రీరామరక్ష. డెల్టా, ఆల్ఫా, ఒమిక్రాన్.. ఏ వేరియంట్ అయినా మనం జాగ్రత్తగా ఉంటే మన దరి చేరదు. అందరూ మాస్కు ధరించాల్సిందే. వ్యాక్సిన్ వేసుకోవాలని కోరారు.
కాగా, గాంధీ ఆస్పత్రిలో గుండె జబ్బుకు సంబంధించిన క్యాథలాబ్ కూడా చేస్తామని తెలిపారు. కొత్త క్యాథలాబ్‌ను రూ. 6.5 కోట్లతో, ఎంఆర్ఐ మిషన్‌ను రూ. 12.5 కోట్లతో మంజూరు చేశాం. గాంధీలో ఎంఆర్ఐ, క్యాథలాబ్‌ను వచ్చే 45 రోజుల్లో అందుబాటులోకి తీసుకొస్తామన్నారుమంత్రి అన్నారు. ఈ కార్యర్రమంలో మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు.