ధాన్యం కొనుగోలు వివాదంపై కరీంనగర్ లో ప్రెస్ మీట్ నిర్వహించారు మంత్రి గంగుల కమలాకర్. బాయిల్డ్ రైసు కొనమంటే.. యాసంగిలో మేము పండించిన పంటనంతా ఎక్కడ నిల్వ చేయాలి? అని ప్రశ్నించారు. కోటి 45 లక్షల టన్నుల దిగుబడి ఈ వానాకాలంలో రాబోతుంటే.. కేవలం కేంద్రం 60 లక్షల మెట్రిక్ టన్నులే కొంటామని తెలిపింది… మీరు ఉచితంగా ఇస్తారో, విదేశాలకో ఎగుమతి చేసుకుంటారో.. మా తెలంగాణ రైతుల పంటను కొనాల్సిందేనని తెలిపారు.
తెలంగాణపై ఎందుకింత వివక్ష అని ప్రశ్నించిన కమలాకర్… ఇటీవలే ఢిల్లీలో కేంద్ర మంత్రి పియూష్ గోయల్ ని కలిసాను… మన దేశం వ్యవసాయక దేశం.. పంట కొనుగోలును ఖర్చు కింద చూడకూదని చెప్పాను… వ్యవసాయంపై చేసే ఖర్చును సామాజిక బాధ్యతగా భావించాలని వివరించానని తెలిపారు. స్వాతంత్ర్యం వచ్చి 70 ఏళ్లైనా రైతులు తమకున్న భూములు పూర్తిగా సాగు చేయలేకపోతున్నారు… సీఎం కేసీఆర్ ప్రభుత్వంలో కాళేశ్వరం జలాలతో పాటు, పంట పెట్టుబడి, సకాలంలో విత్తనాలు, ఎరువులు అందించడం, పంటను కొనడం వల్ల తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు తగ్గాయన్నారు.
యాసంగి సాగు డిసెంబరు, జనవరిలో ప్రారంభమవుతుంది… వానాకాలం సాగు.. జులై, ఆగస్టులో ప్రారంభమవుతుందన్నారు. 2019-20, 2020-21లో వరిపంటలు వేసారు. కేంద్రం ప్రతి ఏడు రాష్ట్రాలతో ఓ ఎంఓయూ చేసుకుంటుంది. ఈ మేరకు రాష్ట్రాలల్లో పీడీఎస్ అవసరాలకు వాడుకోగా మిగిలిన బియ్యాన్ని కొంటామని కేంద్రం 17-09-2020 నాడు రాష్ట్రాలతో ఒప్పందం చేసుకుందన్నారు.
ఈ అగ్రిమెంట్ ప్రకారం మన దగ్గర 2019-20 ఏసంగిలో 64 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఎఫ్.సి.ఐ.కి ఇచ్చాం… 2020-21 ఏసంగిలో 92.32లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి రైసు మిల్లులకు ఇచ్చాం అన్నారు. కేంద్రం ఎంఓయూ ప్రకారం బియ్యం కేంద్రం తీసుకోవాలి. కానీ రైతులు నారు వేసిన తర్వాత.. జనవరిలో మేము బాయిల్డ్ రైస్ కొనబోమని కేంద్రం ప్రకటించిందన్నారు. యాసంగి వచ్చే దొడ్డు వడ్లన్నీ బియ్యంగా మార్చాలంటే బాయిల్డ్ చేస్తారు… వర్షాకాలంలో వచ్చే పంటను నేరుగా బియ్యంగా మార్చవచ్చు(రా రైస్) అన్నారు. బాయిల్డ్ చేయకుండా.. రా రైస్ చేస్తే ఏసంగి పంటలో క్వింటాలు వడ్లకు 40 కిలోల బియ్యం కూడా రావు. నిబంధనల ప్రకారం క్వింటాలుకు క్వింటాలు ధాన్యానికి 67 కిలోల బియ్యం ఎఫ్.సి.ఐకి ఇవ్వాల్సి ఉంటుందన్నారు.
ఎన్నోఏళ్లుగా ఇదే పద్ధతిని రైతులు అమలు చేస్తున్నారు…యాసంగి పంటకు సంబంధించి 92 లక్షల మెట్రిక్ టన్నులు మిల్లుల్లో ఉంది. వీటిని బాయిల్డ్ చేసి బియ్యంగా మారిస్తే 62 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం వస్తాయన్నారు. మా దగ్గర ఇప్పటికే ఐదేళ్లకు సరిపడా బాయిల్డ్ రైసు ఉన్నాయి కాబట్టి.. కేవంల 25 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే తీసుకుంటామంటోంది.. మరి ఈ బియ్యం అంతా ఎక్కడ పెట్టమంటారు? మళ్లీ కొత్తగా వచ్చే పంటను ఎక్కడ పెట్టమంటారు అని ప్రశ్నించారు. ఇలా అయితే మనదగ్గరున్న మిగతా 37 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం ఎవరు కొంటారు? అని తెలిపిన గంగుల… ఇప్పుడు వానాకాలం మరో 55 లక్షల ఎకరాల్లో వరి పంటను తెలంగాణ రైతులు వేసారు… ఈసారి వానాకాలం కోటి 45 మెట్రిక్ టన్నుల ధాన్యం చేతికి రాబోతోందన్నారు.
ఈసారి కోటి 45 లక్షల టన్నుల ధాన్యం వస్తోంది.. రాజ్యాంగం ప్రకారం ఈ బియ్యం మీరే కొనాలి… మీరు ఉచితంగా పంచిపెడతారా? ఏం చేసుకుంటారో మీ ఇష్టం… కానీ పండించిన ధాన్యమంతా కొనాల్సిందేనని తెలిపారు గంగుల. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, మంత్రి కిషన్ రెడ్డికి విజ్ఞప్తి చేస్తున్న.. ఈ విషయంలో కేంద్రంపై మీరు ఒత్తిడి తేవాలి. ..మన రైతుల భవిష్యత్తు కోసం మీరు కూడా మాట్లాడాలన్నారు. గత వానాకాలంలో 1.13 కోట్ల ధాన్యం గతంలో పంజాబ్ లో ధాన్యం పండిస్తే బాయిల్డ్ రైసు కొన్నారు కదా.. మా పంట మాత్రం ఎందుకు 60 లక్షల మెట్రిక్ టన్నులే కొంటారు?.. ధాన్యం సేకరించడాన్ని కేంద్రం సామాజిక బాధ్యతగా చూడాలన్నారు.