కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ నిరాధార అరోపణలపై కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. నాపై కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు నిరాధారం, దురుద్దేశ పూరితం… వెంటనే బహిరంగ క్షమాపణలు చెప్పకుంటే న్యాయపరంగా ముందుకెళ్తాం అన్నారు.మాజీ ఎమ్మెల్యేగా, మాజీ మంత్రి, ఎంపీగా, పీసీసీ అధ్యక్షుడుగా ఉన్న మీ సమక్షంలో అధారాల్లేని ఆరోపణలు చేస్తుంటే మీరు ఖండించక పోవడం విచారకరం అన్నారు. మీ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ పై న్యాయపరంగా ముందుకెళ్తాం… నా స్వంత మండలం పాన్ గల్ మండలకేంద్రం సమీపంలో ఉన్న భూములు నేను, నా సతీమణి పేరు మీద ఉన్న వివరాలు 2018 ఎన్నికల అఫిడవిట్ లో పేర్కొనడం జరిగిందన్నారు. అది ప్రజలందరికీ తెలిసిందే .. గూగుల్ డొమైన్ లో వెతికినా కనిపిస్తుందన్నారు.
30 ఎకరాలు నా పేరు మీద, 10 ఎకరాలు నా సతీమణి పేరు మీద ఉంది .. 15 ఏళ్లుగా అందులో మామిడితోట ఉందన్నారు. స్థానికంగా డాక్టరైన నా కూతురు అక్కడి నుండి ప్రజలకు ఉచిత ఆరోగ్య సేవలు అందించేందుకు నా సతీమణి స్వంత నిధులు, పాన్ గల్ ఎస్ బీ ఐ బ్యాంక్ ద్వారా తీసుకున్న రుణంతో నిర్మించబడిందన్నారు. రెండేళ్ల క్రితం స్వచ్చందంగా గోశాలను నిర్వహించేందుకు 2.5 ఎకరాలు కొత్తగా కొనడం జరిగిందని… అక్కడ , ఇటీవల చండూరు గ్రామంలో ఉన్న నా 10 ఎకరాల భూములతో సహా మొత్తం కేవలం 50 ఎకరాల లోపే .. కానీ 200 ఎకరాలు ఉందని ఆరోపించడం నా ప్రతిష్టకు భంగం కలిగించడమే అన్నారు.
వనపర్తి, పెబ్బేరు పట్టణాలలోని భూములపై చేసిన ఆరోపణలు పూర్తిగా నిరాధారం …1984 నుండి నేను వృత్తి రీత్యా న్యాయవాదిని .. ఈ భూములకు సంబంధించిన వ్యాజ్యాలలో 1990 దశకంలో వృత్తి రీత్యా నా క్లయింటు ఎస్. అజయ్ కుమార్ కుటుంబం తరపున వాదించడం జరిగిందన్నారు. 2001 తర్వాత తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా ఉన్నందున అ కేసుల తరపున వాదనను వదిలేయడం జరిగిందని .. ఆ తరువాత వచ్చిన న్యాయస్థాన ఉత్తర్వులు, తీర్పులతో నాకు ఎటువంటి సంబంధం లేదన్నారు.
ఈ భూములపై వివిధ ట్రిబ్యునల్ , ఇతర కోర్టులు నాటి నా క్లయింట్లకు వ్యతిరేకంగా 2005, 2013 లో తీర్పులు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రావడం జరిగింది .. అప్పటి ఆర్డీఓలు ఇచ్చిన తీర్పులు నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభావితం చేసినట్లా ? నా క్లయింటు అజయ్ కుమార్ కు వ్యతిరేకంగా 2005, 2013 లలో ఇచ్చిన తీర్పులను, ఉత్తర్వులను హైకోర్టు సీసీఎల్ఎ ల్లో విచారించడం జరిగింది . ఇప్పటికీ హైకోర్టులో వివాదమున్నట్లు తెలిసిందన్నారు. ఈ కేసులో ఉన్న రాజా రామేశ్వరరావు , వారసులు, వంశస్థులంతా కాంగ్రెస్ పార్టీకి చెందిన వారేనని…. మరి ఈ భూములకు సంబంధించిన వివాదం నాకు ఎలా ఆపాదిస్తారన్నారు.