గుండెపోటు వచ్చి ఆరోగ్యం విషమించిన తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యం కోసం తాము దేవుడిని ప్రార్థిస్తున్నామని, తమతో పాటు అందరూ ఈ ప్రార్థనల్లో పాల్గొనాలని అపోలో ఆస్పత్రి వర్గాలు ఓ ప్రకటనలో తెలిపాయి. నిన్న సాయంత్రం గుండెపోటు వచ్చిన జయలలిత గుండె, ఊపిరితిత్తులకు ప్రత్యేక పరికరాలతో వైద్యం అందిస్తున్నట్లు ఆస్పతి వైద్యులు తెలిపారు.
సెప్టెంబర్ 22వ తేదీన తీవ్ర జ్వరం, డీహైడ్రేషన్‌తో అపోలో ఆస్పత్రిలో చేరిన జయలలిత దాదాపు కోలుకుంటున్నారని, జయను ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఇంటికి వెళ్లివచ్చన్ని ఇంతకుముందు అపోలో ఆస్పత్రి చైర్మన్ సి.ప్రతాప్ రెడ్డి చెప్పారు. కానీ అంతలోనే మళ్లీ జయలలిత ఆరోగ్యం విషమించింది. ఈ నేపథ్యంలో అపోలో ఆస్పత్రి పలు ట్వీట్లు చేసింది. ఆమెకు ‘ఎక్స్‌ట్రాకార్పోరియల్ మెంబ్రేన్ హార్ట్ అసిస్టెడ్ డివైజ్’ అమర్చామని, పలువురు నిపుణులైన వైద్యులు, క్రిటికల్ కేర్ నిపుణులు చికిత్స అందిస్తున్నారని తెలిపింది. ఇప్పుడు ఆమెకు ఏ తరహా చికిత్స అందించాలన్న విషయమై లండన్‌కు చెందిన వైద్యనిపుణుడు డాక్టర్ రిచర్డ్ బాలేని కూడా సంప్రదిస్తున్నట్లు తెలిపింది. ఆమె కోలుకోవాలని అందరూ ప్రార్థించాలని కోరింది.
ప్రస్తుతం తమిళనాడులో ఒక విధమైన భావోద్వేగ వాతావరణం నెలకొంది. జయ ఆరోగ్యంపై తమిళనాడు కేబినెట్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది. కాగా, రాష్ట్రంలోని అన్నాడీఎంకే ఎమ్మెల్యేలందరూ ఈరోజు ఉదయం 11గంటల వరకు జయలలిత చికిత్స పొందుతున్న అపోలో ఆస్పత్రికి చేరుకోవాలని ఆ పార్టీ ఆదేశించింది. ఈ క్రమంలో ఇప్పుడిప్పుడే ఎమ్మెల్యేలు ఆస్పత్రికి చేరుకుంటున్నారు. ఇప్పటికే దాదాపు అందరు మంత్రులూ ఆస్పత్రి వద్దే ఉన్నారు.
జయలలిత గొప్ప నాయకురాలని అపోలో ఆస్పత్రుల డైరెక్టర్ సంగీతా రెడ్డి ట్వీట్టర్ వేదిక వ్యాఖ్యానించారు. అపోలో వైద్యులు జయలలితకు వైద్యం అందిస్తున్నారని, వారి ఉత్తమ ప్రయత్నంతో త్వరలోనే జయలలిత కోలుకుంటారని ఆశిస్తున్నట్లు తెలిపారు.
జయలలిత ఆరోగ్యం విషమంగా ఉండటంతో 8మంది అపోలో వైద్యులు అత్యవసర చికిత్స అందిస్తున్నారు. లండన్ డాక్టర్ రిచర్డ్ బేలీని కూడా వారు సంప్రదించి వైద్య సేవలు కొనసాగిస్తున్నారు.