జయలలిత సీరియస్….

211
- Advertisement -

అన్నాడీఎంకే అధినేత్రి, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్య పరిస్థితి విషమించింది. 74 రోజులుగా ఆస్పత్రిలోనే ఉన్న జయకు.. ఆదివారం సాయంత్రం గుండెపోటు వచ్చింది. దీంతో ప్రత్యేక వార్డు నుంచి క్రిటికల్‌ కేర్‌ యూనిట్‌కు తరలించి చికిత్స చేస్తున్నట్లు అపోలో ఆసుపత్రి వైద్యులు ప్రకటించారు.

హృద్రోగ, శ్వాసకోశ, క్రిటికల్‌ కేర్‌ నిపుణులు ఆమెకు చికిత్స అందిస్తున్నట్లు ఆసుపత్రి ప్రతినిధి ఒకరు తెలిపారు. దాదాపు రెండున్నర నెలల క్రితం జయలలిత డీహైడ్రేషన, తీవ్ర జ్వరంతో బాధపడుతూ సెప్టెంబరు 22న స్థానిక గ్రీమ్స్‌ రోడ్డులోని అపోలో ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. లండన్‌కు చెందిన అవయవ ఇన్ఫెక్షన చికిత్సా నిపుణుడు డాక్టర్‌ బీలే, ఢిల్లీ ఎయిమ్స్‌ వైద్యులు, సింగపూర్‌ ఫిజియో థెరపీ వైద్యులు చేసిన చికిత్స కారణంగా ఆమె క్రమేపీ కోలుకున్నారు. దీంతో, నవంబరు 19న ఐసీయూ నుంచి ఆమెను ప్రత్యేక వార్డుకు మార్చారు. ఆమె బాగా కోలుకున్నారని, ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇంటికి వెళ్లవచ్చని ఆస్పత్రి చైర్మన్‌ డాక్టర్‌ ప్రతాప్‌ సి.రెడ్డి ప్రకటించారు.

Tamil Nadu CM Jayalalithaa suffers cardiac arrest

అయితే జయకు అమర్చిన కృత్రిమశ్వాస పరికరాన్ని కూడా తొలగించడంతో త్వరలోనే ఆమె క్షేమంగా ఇంటికి చేరకుంటారని అన్నాడీఎంకే నేతలు భావించారు. ఈ మేరకు ఆదివారం మధ్యాహ్నమే ఆ పార్టీ నేత, మాజీ మంత్రి సి.పొన్నయన్‌ ఒక ప్రకటన చేశారు. శనివారం రాత్రి జయలలిత ఆరోగ్య పరిస్థితిని పరిశీలించిన ఎయిమ్స్‌ వైద్య నిపుణులు ఆమెకు ఇక కృత్రిమశ్వాస అవసరం లేదని, ఆమె మామూలుగానే ఊపిరి పీల్చుకోగలుగుతున్నారని, శ్వాసకోస సమస్యల నుండి కూడా పూర్తిగా బయటపడ్డారని నిర్ధారించారని పొన్నయన్‌ పేర్కొన్నారు. కానీ అనూహ్యంగా ఆదివారం సాయంత్రానికి జయ ఆరోగ్య పరిస్థితి విషమించింది. సాయంత్రం 6 గంటల సమయంలో ఆమెకు గుండెపోటు వచ్చింది. దీంతో జయకు ‘ఎక్మో’ మిషన్ అమర్చిన వైద్యులు ఆమెను రక్షించేందుకు శతవిధాలా ప్రయత్నాలు ప్రారంభించారు. ప్రస్తుతం ఎయిమ్స్‌ వైద్యులు, లండన్‌ వైద్యుడు బీలేతో ఆమె ఆరోగ్యపరిస్థితిపై సంప్రదింపులు జరుపుతూ వైద్యం అందిస్తున్నారు.

Amma Jayalalithaa in ICU on vents
జయలిలత ఆరోగ్యంపై ప్రధాని నరేంద్ర మోదీ ఆరాష్ట్ర గవర్నర్‌ విద్యసాగర్‌రావుకు ఫోన్‌ చేసి ఆరాతీసారు. జయకు మెరుగైన వైద్యం అందించాలని మోడీ సూచించారు. అదేవిధంగా కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ కూడా విద్యాసాగర్‌రావుకు ఫోన చేసి దాదాపు 10 నిమిషాల పాటు మాట్లాడారు. జయ ఆరోగ్యంపై ఆయన వివరాలు తెలుసుకున్నారు. ఇక, జయ తిరిగి అనారోగ్యానికి గురైన విషయం తెలుసుకున్న వెంటనే గవర్నర్‌ విద్యాసాగరరావు హుటాహుటిన చెన్నై చేరుకున్నారు. విమానాశ్రయం నుంచి నేరుగా రాత్రి 12.05 గంటల సమయంలో ఆయన అపోలో ఆస్పత్రికి చేరుకున్నారు. మరోపక్క, జయ త్వరగా కోలుకోవాలని భగవంతుని ప్రార్థిస్తున్నట్లు రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ఆదివారం రాత్రి ట్వీట్‌ చేశారు. పలువురు కేంద్రమంత్రులు కూడా జయకోలుకోవాలని భగవంతుని ప్రార్థిస్తున్నట్లు ట్వీట్‌ చేశారు. సోషల్‌ మీడియాలో నెటిజన్లు కూడా జయలిలత త్వరగా కొలుకోవాలని ట్వీట్‌ చేస్తున్నారు

Tamil Nadu CM Jayalalithaa suffers cardiac arrest
తమిళనాడులో హైఅలర్ట్‌

తమిళనాడు సీఎం జయలలిత గుండెపోటు వార్తల నేపథ్యంలో తమిళనాడు వ్యాప్తంగా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా చూసేందుకు రాష్ట్రవ్యాప్తంగా 114 సెక్షన్‌ విధించాలని పోలీసు అధికారులు నిర్ణయించారు. మరోవైపు సీఆర్పీఎఫ్‌, సీఐఎస్‌ డీఐజీలను తమిళనాడుకు చేరుకొని పరిస్థితిని పరిశీలించాలని కేంద్రం ఇప్పటికే ఆదేశించింది. ఇప్పటికే సీఆర్పీఎఫ్‌, సీఐఎస్‌ బలగాలను పెద్ద ఎత్తున తమిళనాడుకు తరలిస్తున్నారు. ప్రధాన నగరాల్లో భారీ సంఖ్యలో భద్రతాదళాలను మోహరించారు. రాష్ట్రంలో పరిస్థితిని సమీక్షించేందుకు ఇద్దరు కేంద్ర మంత్రులు రాష్ట్రానికి చేరుకొన్నారు. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థల బంద్‌కు అన్నాడీఎంకే పిలుపునిచ్చింది. చెన్నైలోని పలు కార్యాలయాలకూ సోమవారం సెలవు ప్రకటించారు. ఆదివారం రాత్రి నుంచే రాష్ట్రవ్యాప్తంగా హోటళ్లు, పెట్రోలు బంకులు మూతపడ్డాయి. రాష్ట్రవ్యాప్తంగా అప్రకటిత కర్ఫ్యూ వాతావరణం నెలకొంది.

- Advertisement -