రాష్ట్ర రైతు సమన్వయ సమితి అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు మాజీ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ వేయాలని సీఎం కేసీఆర్ కోరడంతో గుత్తా ఈ పదవికి రాజీనామా చేశారు. గుత్తా సుఖేందర్ రెడ్డి రాజీనామాను రాష్ట్ర ప్రభుత్వం ఆమెదించింది.
నల్గొండ జిల్లాకు చెందిన గుత్తా రాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్ర వేయడమే కాదు పార్టీలో సీనియర్ నేతగా ఉన్నారు. జిల్లా రాజకీయాలపై మంచిపట్టుంది. అంతేగాదు సీఎం కేసీఆర్‌కి అత్యంత సన్నిహితుడు. అందుకే ఆయన్ని రైతు సమన్వయ సమితి అధ్యక్షుడిగా సైతం నియమించారు సీఎం.
ఎమ్మెల్సీ యాదవరెడ్డిపై అనర్హత వేటు పడటంతో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్ధానం ఖాళీ అయింది. ఇక ఈ నెల 7న నోటిఫికేషన్ జారీ చేయనుండగా అదే రోజు నుంచి నామినేషన్ల స్వీకరణ మొదలవుతుంది. నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ ఈ నెల 14. నామినేషన్ పత్రాలను 16న పరిశీలిస్తారు. ఉపసంహరణకు 19వ తేదీ వరకు గడువిచ్చారు. ఎన్నికలు అవసరమైతే 26న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 వరకు పోలింగ్ జరుగుతుంది. అసెంబ్లీలో మెజార్టీ బలం ఉండటంతో గుత్తా ఎన్నిక లాంఛనమే కానుంది.