వేలాదిమంది ఐటీ ఉద్యోగులను ఇంటికి పంపేందుకు పలు ఐటీ సంస్థలు రంగం సిద్ధం చేశాయి. దేశీయ ఐటీ సంస్థలు వేలమంది నిపుణులను తొలగిస్తున్నాయనే వార్తలే ఉద్యోగులకు ఆందోళన కలిగిస్తున్నాయి. మరో మూడేళ్ల పాటూ ఇంతే సంఖ్యలో ఇంజినీర్లు తొలగింపునకు గురవుతారని హెడ్‌హంటర్స్ ఇండియా వ్యవస్థాపకుడు, ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కె.లక్ష్మీకాంత్ పేర్కొన్నారు. ఐటీ రంగం ఇప్పుడు అనిశ్చితిలో ఉంది. క్లౌడ్ ఆధారిత డిజిటల్ టెక్నాలజీలు శరవేగంగా దూసుకొస్తున్నాయి. కంపెనీలు కూడా వీటిపై దృష్టి సారించి, సిబ్బందికి శిక్షణ ఇప్పిస్తున్నాయి. ఈ పరిణామ క్రమంలో 35 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయస్సున్న నిపుణులే ఇబ్బంది పడతారని లక్ష్మీకాంత్ వివరించారు. ఇదంతా వీసా నిబంధనలను అమెరికా కఠినతరం చేయడం వల్లే జరగడం లేదన్నారు.
ఈ మేరకు ఫిబ్రవరి 17న నాస్కామ్ ఇండియా లీడర్‌షిప్ సదస్సులో మేకిన్సే అండ్ కంపెనీ ఇచ్చిన నివేదికను ఉదహరించారు. ప్రస్తుత ఐటీ ఉద్యోగుల్లో దాదాపు సగం మంది రాబోయే మూడునాలుగేళ్ల అవసరాలకు తగినట్టు ఉండరని నివేదిక పేర్కొంది. అంటే అటువంటి వారికి సంస్థలు చెక్ చెప్పడం ఖాయమని ఆయన అభిప్రాయపడ్డారు. ‘తక్కువ వేతనంపై విదేశీ నిపుణులను అమెరికాకు తీసుకెళ్లి పనిచేయించుకోవడం సరికాదని ఐటీ కంపెనీలకూ తెలుసు. స్థానికులకే ఉద్యోగాలివ్వాలన్న అమెరికా అధ్యక్షుడి నిబంధనల వల్ల ఎదురవుతున్న పరిణామాలను పరిష్కరించుకోవడం ఐటీ సంస్థల చేతుల్లో ఉంది. వాటికి ఇది కొత్త కాదు’ అని పేర్కొన్నారు.
‘దేశంలో దాదాపు 39 లక్షల మంది ఐటీ రంగంలో ఉపాధి పొందుతున్నారు. వీరిలో 50-60 శాతం మంది ప్రస్తుత నైపుణ్యాలతో, సంప్రదాయ ఐటీ సేవల్లో కొనసాగవచ్చు. మిగిలినవారు తొలగింపునకు గురయ్యే అవకాశం ఉంది. రాబోయే మూడేళ్లలో ఇలా ఇబ్బంది పడేవారు 5-6 లక్షల మంది ఉండొచ్చు. అంటే సగటున ఏడాదికి 1.75 – 2.0 లక్షల మంది తొలగింపునకు గురవుతారు’ అని లక్ష్మీకాంత్ విశ్లేషించారు. ముంబయి, బెంగళూరు వంటి మహానగరాల్లో తొలగింపులు ఉండవని, కోయంబత్తూరు వంటి మరికొన్ని చిన్న ప్రాంతాల్లో ఉంటాయనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్(కృత్రిమ మేథ), రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్, క్లౌడ్ కంప్యూటింగ్ వంటి కొత్త టెక్నాలజీల వల్ల తక్కువ మంది సిబ్బందితోనే పనులు పూర్తవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే సంస్థలు తమ వ్యూహాలు మార్చుకుంటున్నాయి. ‘ప్రస్తుత పరిస్థితుల ప్రకారం ఐటీ నిపుణులు కొత్త టెక్నాలజీలు నేర్చుకుంటే, తమకు గిరాకీ పెరుగుతుందని గమనించాలి’ అని ఎగ్జిక్యూటివ్‌ల నియామక సంస్థ గ్లోబల్‌హంట్ మేనేజింగ్ డైరెక్టర్ సునీల్ గోయెల్ వివరించారు. ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్, టెక్‌మహీంద్రా, విప్రో సంస్థల్లో కలిపి 7.60 లక్షల మంది ఉద్యోగులున్నారని, వీరిలో 2-3 శాతం మందిని తొలగించడం ఆందోళనకరం కాదని జపనీస్ బ్రోకరేజీ సంస్థ నొమురా పేర్కొంది. అయితే డిజిటల్ టెక్నాలజీలు నేర్చుకునే దాకా తొలగింపుల ప్రక్రియ కొనసాగుతుందని వివరించింది.
ఇదిలా ఉండగా దేశంలోనే పెద్ద కంపెనీలైనా విప్రో, ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్, టెక్ మహేంద్రలు పెద్ద సంఖ్యలో ఉద్యోగులకు పింక్ స్లిప్స్ ఇచ్చేందుకు సిద్దపడ్డాయి. ఈ సంఖ్య సుమారు 56000గా ఉండోచ్చని అంచనా.. ఈ సంఖ్య గత సంవత్సరంతో పోలీస్తే రెట్టింపు అయ్యింది.