యాదాద్రి చరిత్రలో నిలిచిపోవాలి

254
- Advertisement -

వచ్చే ఏడాది దసరా నాటికి యాదాద్రి దేవాలయాన్ని అత్యద్బుతంగా తీర్చిదిద్ది భక్తుల సందర్శనార్థం సిద్దం చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. యాదాద్రి ఆలయ నిర్మాణ పురోగతిపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ సమీక్ష నిర్వహించారు. సమీక్షలో యాదాద్రి దేవస్థానం తుది నమూనాకు సీఎం ఆమోదం తెలిపారు. ప్రధాన ఆలయ సముదాయాల నిర్మాణం, భక్తుల కోసం నిర్మించనున్న నిర్మాణాల త్రీడీ వీడియో, ఫొటోలను సీఎం వీక్షించారు. ఆగమశాస్త్ర పండితుల నిర్దేశాల మేరకు నిర్మితమవుతున్న ఆలయ కట్టడాల త్రీడీ నమూనాల పట్ల సీఎం కేసీఆర్ సంతృప్తి వ్యక్తం చేశారు.

యాదాద్రి భక్తుల బస కోసం నిర్మించ తలపెట్టిన కాటేజీలను కొన్ని చిన్న చిన్న మార్పులతో సీఎం ఆమోదించారు. వచ్చే ఏడాది దసరానాటికి యాదాద్రి దేవాలయాన్ని అత్యద్భుతంగా తీర్చిదిద్ది భక్తుల సందర్శనార్థం సిద్ధం చేయాలని అధికారులకు సీఎం నిర్దేశించారు. ప్రపంచంలోనే ప్రత్యేక నిర్మాణ కౌశలంతో దైవభక్తి ఉట్టిపడే విధంగా పవిత్ర శిల్పకళా నైపుణ్యంతో యాదాద్రి దేవస్థానం రూపుదిద్దుకుంటోందన్నారు. ఐదు రాజగోపురాలతో ప్రాకార మండపాలు పూర్తి స్థాయి శిలతో నిర్మితం కానున్నాయన్నారు.

ప్రపంచంలోనే మొదటి దేవస్థానంగా యాదాద్రి చరిత్రలో నిలిచిపోనుందని ఆకాంక్షించారు. యాదాద్రి ఆలయ సముదాయం పూర్తిస్థాయి కృష్ణ శిలతో నిర్మితం కావడం విశేషమన్నారు. 500మంది నిష్ణాతులైన శిల్పులు యాదాద్రిలో ఇప్పటికే శిల్పాలు చెక్కడం, నిర్మాణ పనుల్లో నిమగ్నమయ్యారని వెల్లడించారు. రాష్ట్రపతి, ప్రధాని, గవర్నర్, సీఎంతో పాటు పలువురు వీవీఐపీలు దైవదర్శనం కోసం వచ్చినపుడు బస చేసేందుకు అవసరమైన ప్రత్యేక కాటేజీ ‘దైవ సన్నిధి’ నిర్మాణాలను సీఎం అభినందించారు.

ఆగమ శాస్త్ర సూత్రాలను తూచ తప్పకుండా తంజావూర్ వంటి వేల ఏళ్ల కిందటి సాంప్రదాయ నిర్మాణ కౌశలానికి యాదాద్రి ప్రాణ ప్రతిష్ట పోయనున్నదని తెలిపారు. 2.50 ఎకరాల్లో నిర్మిస్తున్న కాటేజీల సముదాయాలకు పలు కార్పోరేట్ సంస్థలు ముందుకు రావడం సంతోషకరమన్నారు. యాదాద్రిలో పూర్తిస్థాయి నిర్మాణాల అనంతరం గుట్టపై పచ్చదనం వెల్లువిరియడంతోపాటు ఆలయ పరిసరాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుతాయని సీఎం కేసీఆర్‌కు అధికారులు వివరించారు.

యాదాద్రిలో 108 అడుగుల ఆంజనేయ స్వామి భారీ విగ్రహ నమూనాలకు సీఎం ఆమోదం తెలిపారు. ఆంజనేయ స్వామి భారీ విగ్రహ రూపకల్పనకు చైనా శిల్పులు ముందుకొచ్చారు. ఈ నేపథ్యంలో ఆర్కిటెక్ట్ ఆనందసాయి, దేవాలయ కమిటీ సభ్యులు చైనాలో పర్యటించనున్నారు.

- Advertisement -