రెండు రోజుల్లో 400 అక్రమ కట్టడాల కూల్చివేత

307
- Advertisement -

హైదరాబాద్ నగరంలో అక్రమ కట్టడాలను కూల్చివేయడంతో పాటు రోడ్లు ఇతర మౌళిక సౌకర్యాల కల్పనను సమాంతరంగా చేపట్టాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఆదేశించారు. బుధవారం నాడు క్యాంపు కార్యాలయంలో హైదరాబాద్ నగరంలో నాలాలపై నిర్మించిన అక్రమ కట్టడాల కూల్చివేతలతో పాటు ఇతర అభివృధ్ది కార్యక్రమాలను సమీక్షించారు. నగర అభివృద్ధికి బ్యాంకర్ల సహాయం తీసుకుని అభివృద్ది ప్రణాళికను రూపొందించాలని మున్సిపల్ మంత్రి కె.తారకరామారావును, అదికారులను ఆదేశించారు.

తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్ధితో మిషన్ భగీరథ వంటి పధకాలను చేపడుతుండడంతో బ్యాంకర్లలో విశ్వాసం ఏర్పడి రుణాలు ఇవ్వడానికి ముందుకొచ్చారని సిఎం పేర్కొన్నారు. హైదరాబాద్ నగరం వ్యాపార రంగంలో ఇంకా అభివృద్ధి దిశగా వెళ్లే అవకాశం ఉన్నందున ప్రభుత్వరంగ బ్యాంకులను రుణాల కోసం సంప్రదించి పకడ్బందీ ప్రణాళికను రూపొందించుకోవాలని సూచించారు. బ్యాంకర్లు ఇచ్చే రుణాలకు రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ ఉంటుందని సిఎం తెలిపారు.

నగరంలో అత్యవసరంగా రోడ్ల నిర్మాణాన్ని చేపట్టాలని ముఖ్యమంత్రి సూచించారు. హైదరాబాద్ నగరం ఆదాయం భవిష్యత్ లో ఇంకా ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున మహా గొప్ప నగరంగా రూపొందించేందుకు అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. పది నుంచి పన్నెండు సంవత్సరాలు నిరంతర కృషి చేస్తేనే హైదరాబాద్ విశ్వనగరంగా తయారవుతుందని. ఆ దిశగా పూనాది బలంగా వేసుకోవాల్సిన అవసరాన్ని గుర్తించాలని సూచించారు.

రహదారులు, డ్రైనేజీ వ్యవస్థ శాశ్వత ప్రాతిపదికన చేపట్టడంతో పాటు నగరం చుట్టూ రైతుల భాగస్వామ్యంతో టౌన్ షిప్స్ నెలకొల్పేందుకు ప్రణాళిక సిద్ధం చేయాలని సిఎం ఆదేశించారు. నగరంలో వరదల కారణంగా రహదారులకు జరిగిన నష్టాన్ని అంచనా వేసి నివేదికను వెంటనే కేంద్ర ప్రభుత్వానికి అందజేయాలని సూచించారు. అక్రమ కట్టడాల కూల్చివేతల విషయంలో ఇదే వేగాన్ని కొనసాగించాలని ఆదేశించారు. హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం ప్రత్యేకంగా వచ్చే రాష్ట్ర బడ్జెట్ నిధులు కేటాయిస్తామని ముఖ్యమంత్రి వెల్లడించారు. ఇటీవలి వరదలవల్ల పాడైన రోడ్లను పునరుద్ధరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నుండి నిధులు కేటాయిస్తామని సిఎం తెలిపారు. బుధవారం సాయంత్రం వరకు నగరంలో రెండు రోజుల్లో నాలుగు వందల అక్రమ కట్టడాలను కూల్చివేసినట్లు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.

- Advertisement -