ఆదివారం తెల్లవారుజామున జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి విరుచుకుపడ్డారు. బారాముల్లా జిల్లాలోని సరిహద్దు ప్రాంతం యురి సెక్టార్లో గల ఆర్మీ హెడ్ క్వార్టర్స్ లక్ష్యంగా కాల్పులకు తెగబడ్డారు ఉగ్రవాదులు. పర్వత ప్రాంతాల్లో ఉగ్రవాదులు నక్కి, కాల్పులు జరిపారు. గంటలపాటు జరిగిన ఈ ఎన్కౌంటర్లో 17 మంది సైనికులు వీరమరణం పొందారు. అనంతరం దాడికి పాల్పడిన నలుగురు ముష్కరులను సైన్యం హతమార్చింది. గాయపడిన జవాన్లను శ్రీనగర్‌లోని ఆర్మీ బేస్ ఆసుత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సైనిక కేంద్రాలపై ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించిన నేపథ్యంలోనే ఈ దాడి జరగడం గమనార్హం.
దాడి జరిగిన విషయం తెలిసిన వెంటనే హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఉన్నతాధికారులతో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసి పరిస్థితిని సమీక్షించారు. ఈ సమావేశానికి రక్షణ శాఖ అధికారులు కూడా హాజరయ్యారు. జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి, గవర్నర్లకు ఫోన్ చేసి ఆరా తీశారు. ఈ దాడి నేపథ్యంలో తన రష్యా, అమెరికా పర్యటనలను రాజ్‌నాథ్ వాయిదా వేసుకున్నారు.