విశ్వమాత మదర్ థెరేసాకు సెయింట్ హోదా దక్కింది. ఇవాళ రోమ్ లోని వాటికన్ సిటీలో…. జరిగిన క్యాననైజేషన్ కార్యక్రమంలో… మదర్ థెరిసాకు సెయింట్ హోదాను అధికారికంగా ప్రకటించారు. మదర్ థెరిసాను సెయింట్ గా ధ్రువీకరిస్తూ.. గత మార్చి 15న… క్రైస్తవ మత గురువు పోప్ ఫ్రాన్సిస్ ప్రకటన చేశారు. సెయింట్ హోదా దక్కిన తర్వాత… మదర్ థెరిసాను దైవదూతగా పరిగణించారు క్రైస్తవ మతపెద్దలు.
ఈ కార్యక్రమానికి ప్రపంచవ్యాప్తంగా లక్షలమంది థెరిసా అభిమానులు తరలివచ్చారు. భారత్ నుంచి విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి సుష్మాస్వరాజ్ నేతృత్వంలోని 12 మంది సభ్యుల బృందం హాజరైంది. మదర్ థెరిసా స్థాపించిన ‘మిషనరీస్ ఆఫ్ ఛారిటీ’ సుపీరియల్ జనరల్ సిస్టర్ మేరీ ప్రేమ ఆధ్వర్యంలో దేశంలోని విభిన్న ప్రాంతాలకు చెందిన 40 మందికి పైగా నన్స్ కూడా పాల్గొన్నారు.
కోల్‌కతా వీధుల్లో 45 సంవత్సరాల పాటు పేదలు, రోగుల సేవలో నిమగ్నమైన మదర్ థెరిసాకు సెయింట్ హోదా ఇవ్వనున్నట్లు మార్చి నెలలో పోప్ ఫ్రాన్సిస్ ప్రకటించారు. ఈ ప్రక్రియ కోసం కనీసం రెండు మహిమలు చోటుచేసుకోవాల్సి ఉండగా.. ఆ రెండు ఘటనల్నీ గుర్తించారు. 2002లో వాటికన్ అధికారికంగా తొలి మహిమను గుర్తించింది. కడుపులో కణతిలో బాధపడిన మోనికా బెర్సా అనే బెంగాలీ గిరిజన మహిళకు 1998లో నయమైన ఘటనను గుర్తించింది. రెండో మహిమ బ్రెజిల్‌లో చోటుచేసుకుంది. థెరిసా ప్రార్థనల ఫలితంగా ఓ వ్యక్తి అద్భుతరీతిలో కోలుకున్నట్లు గుర్తించారు.
మదర్ థెరెసా క్యాననైజేషన్ పై రాష్ట్రపతి ప్రణబ్ సంతోషం వ్యక్తంచేస్తూ ప్రత్యేక ప్రకటన విడుదల చేశారు. అనాథలు, పేదల జీవితాల్లో వెలుగు నింపేందుకు… ఆమె తన జీవితాన్ని ధారపోశారని చెప్పారు. గొప్ప అంకితభావంతో… సేవే లక్ష్యంగా… ప్రేమ, మానవత్వాన్ని చిరునవ్వులతో మదర్ పంచారనీ… ఐనా… దేవుడి చేతిలో తానో చిన్న పెన్సిల్ ను మాత్రమేనని చెప్పుకునేవారనీ గుర్తుచేశారు. మదర్ థెరిసాను సెయింట్ గా గుర్తించడాన్ని… భారతదేశ పౌరులు గర్వంగా భావిస్తారని చెప్పారు. మదర్ స్ఫూర్తితో… మానవ సేవకు పునరంకితం కావాలని పిలుపునిచ్చారు.