సేవకు మారుపేరు మదర్ థెరిసా..

30
- Advertisement -

అనాథలు, పేదల జీవితాల్లో వెలుగు నింపేందుకు… ఆమె తన జీవితాన్ని ధారపోశారు. గొప్ప అంకితభావంతో… సేవే లక్ష్యంగా… ప్రేమ, మానవత్వాన్ని చిరునవ్వులను పంచారు. సేవకు మారు పేరుగా విశ్వమాతగా పేరు తెచ్చుకున్నారు మదర్ థెరిసా. ఇవాళ ఆమె బర్త్ డే సందర్భంగా greattelangaana.com ప్రత్యేక కథనం.

1910 ఆగస్టు 26న జన్మించిన మదర్ థెరిసా అసలు పేరు.. ఆగ్నెస్ గోన్క్సా బొజాక్ష్యు. ఆమె తండ్రి కూడా ఇతరులకు సేవ చేయడంలో ముందుండేవారు. అనాథ పిల్లల కోసం లెట్నికాలో ఆశ్రమం స్థాపించారు. అది ఇప్పటికీ ఎంతో మందికి అన్నం పెడుతోంది. 1919లో తండ్రి అనారోగ్యంతో మరణించగా తన 12 ఏళ్ల వయస్సులోనే సేవకు అంకితమయ్యారు. 18వ ఏట సిస్టర్స్ ఆఫ్ లోరెటో సంఘంలో చేరిన థెరిసా.. 1937, మే 4న కోల్‌కతాలో ఆ సంస్థకు చెందిన స్కూల్లో టీచర్‌గా చేరారు. కోల్‌కతాలోని మురికివాడల్లో దయనీయ పరిస్థితి చూసి టీచర్ ఉద్యోగానికి స్వస్తి పలికి.. మానవ సేవకు నడుం బిగించారు. అనాథల పోషణకు తగిన నిధులు లేకపోవడంతో.. కోల్‌కతా వీధుల్లో యాచించి మరీ వారి పొట్ట నింపేవారు.

Also Read:Bhumana:వరలక్ష్మీ వ్రతంతో సుఖశాంతులు

సహాయం చేయడానికి ఉండాల్సింది డబ్బు కాదు.. మంచి మనస్సు అని చెప్పేవారు మదర్. మనం మాట్లాడే ప్రతి పలుకూ ప్రేమతో ఉండాలని…నువ్వు ఎంత ఇస్తున్నావనేది కాదు.. ఎంత ప్రేమగా ఇస్తున్నావనేది ముఖ్యం అని తన ప్రసంగాల ద్వారా చాటేవారు. ప్రపంచ శాంతి కావాలని మీరనుకుంటే..ముందు మీ కుటుంబ సభ్యుల్ని ప్రేమించడం మొదలుపెట్టండని సూచించేవారు. వంద మందికి నువ్వు సహాయాపడలేకపోవచ్చు..కానీ, కనీసం ఒక్కరికైనా సహాయపడు…ప్రోత్సాహం లేదని మంచి పనిని వాయిదా వేయకండి….ఏదైనా ప్రేమతో చేసి చూడండి. అది మీ జీవితాన్ని సంతోషపరుస్తుందని చెప్పేవారు.

మిషనరీస్ ఆఫ్ ఛారిటీ అనే సేవాసంస్థను స్ధాపించి అనేక మంది జీవితాల్లో వెలుగులు నింపారు. ఈ సంస్థ ద్వారా మదర్ థెరిసా చేస్తున్న సేవలను గుర్తించిన నోబెల్ బహుమతి కమిటీ ఆమెకు 1979లో నోబెల్ శాంతి బహుమతిని లభించింది. థెరీసా సేవలు కేవలం ఇండియాకే పరిమితం కాలేదు. ఆసియా, ఐరోపా, ఆఫ్రికా, రోమ్, టాంజానియా, ఆస్ట్రియాలకు సైతం తన సేవలను విస్తరించారు. 1997న మార్చి 13న మిషనరీస్ ఆఫ్ చారిటీ అధినేత పదవికి థెరీసా రాజీనామా చేశారు. అదే ఏడాది తీవ్ర అనారోగ్యంతో సెప్టెంబర్ 5న మరణించారు. ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే వీడియోలు తీసుకుని సంతోషించే రోజులివి. కానీ, తోటివారికి సాయం చేయడానికి తన జీవితాన్నే త్యాగం చేసిన మహనీయురాలు. కష్టాల్లో ఉన్నవారికి వెతికి మరీ సాయమందించిన అమ్మ కంటే పెద్ద మనసు ఆమెది. అందుకే ఆమె అందరికీ ‘అమ్మ’ మథర్ థెరిసా.

Also Read:ఎన్నారై బీఆర్ఎస్ యూకే ప్రత్యేక ఎన్నికల కమిటీ

- Advertisement -