తెలంగాణ ప్రజల దాహార్తిని తీర్చే మిషన్ భగీరథలో భాగస్వామ్యమయ్యేందుకు బ్యాంకులు ముందుకొచ్చాయి. ఆంధ్రాబ్యాంకు నేతృత్వంలో కన్సార్టియంగా ఏర్పడ్డ 7 బ్యాంకులు దాదాపు రూ. 6,750 కోట్ల రూపాయల ఆర్థిక సహాయానికి అంగీకరించాయి. ఇందులో ఆంధ్రాబ్యాంక్ రూ. 1300 కోట్లు, దేనా బ్యాంక్ రూ. 500 కోట్లు, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ రూ. 700 కోట్లు, సిండికేట్ బ్యాంక్ రూ. 1000 కోట్లు, ఓబీసీ బ్యాంక్ రూ. 1000 కోట్లు, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర రూ. 1000 కోట్లు, ఇండియన్ బ్యాంక్ రూ. 750 కోట్లు, అలహాబాద్ బ్యాంక్ రూ. 500 కోట్లు సహాయం చేయనున్నాయి. హైదరాబాద్ సైఫాబాద్ లోని ఆంధ్రాబ్యాంకు ప్రధాన కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నాయి.
ఆంధ్రా బ్యాంకు ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ సురేష్ ఎన్. పటేల్ అధ్యక్షతన జరిగిన కన్సార్టియం మీటింగ్ లో పంచాయతీరాజ్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎస్పీ సింగ్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, ఆర్థిక శాఖ ప్రధాన కార్యదర్శి నవీన్ మిట్టల్, పంచాయతీరాజ్ జాయింట్ సెక్రటరీ శ్రీధర్, ఆర్థిక శాఖ జాయింట్ సెక్రటరీ రామ్మోహన్, ఆర్.డబ్ల్యు.ఎస్ అండ్ ఎస్ ఈ.ఎన్.సి సురేందర్ రెడ్డి తో పాటు అలహాబాద్, దేనా, పంజాబ్ అండ్ సింధ్, సిండికేట్, ఓబీసీ, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఇండియన్ బ్యాంకు ప్రతినిధులు పాల్గొన్నారు.