ఖైరతాబాద్ మహా గణపతి చెంత భక్తులకు దర్శనం అవకాశం ఈనెల 14వ తేదీ (బుధవారం) అర్ధరాత్రి వరకే ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఖైరతాబాద్ గణనాథుడిని తొలుతే నిమజ్జనం చేయనున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. 15వ తేదీన ఉదయం 6 గంటల నుంచి శోభాయాత్ర మొదలు పెడతారు. మధ్యాహ్నం లోపు నిమజ్జనం పూర్తి చేస్తారు.
బక్రీద్, గణేష్ నిమజ్జనానికి భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు సీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. ఈమేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. ఎలాంటి అవాంచనీయం సంఘటనలు జరగకుండా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లను చేశామని చెప్పారు. 20 వేల మంది పోలీసు సిబ్బంది ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ప్రార్థనలు జరిగే ప్రాంతాల్లో సీపీ టీవీ కెమెరాల అమర్చి నిఘా ఏర్పాటు చేశామని తెలిపారు. ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరుగకుండా నిఘా కొనసాగుతుందన్నారు.
శాంతి భద్రలు పూర్తి స్థాయిలో ప్రశాంతంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవడం జరిగిందని చెప్పారు. ప్రజలు పోలీసు వ్యవస్థకు సహకరించాలని కోరారు. యువతీయువకులను వాలంటీర్లుగా తీసుకుని ముందుకు వెళ్తున్నామని తెలిపారు. బక్రీద్, గణేష్ నిమజ్జనం సమయంలో రోడ్లపై ఏర్పడే చెత్తను తొలగించేందుకు లక్ష క్యారీ బ్యాగ్స్ ను పంపిణీ చేశామని పేర్కొన్నారు. జీహెచ్ ఎంసీ కూడా లక్ష క్యారీ బ్యాగ్ లు పంపిణీ చేసినట్లు తెలిపారు. అన్ని పోలీసు స్టేషన్ల ఏరియాలో ప్రజా రక్షణకు భంగం కలగకుండా చర్యలు తీసుకున్నామని చెప్పారు.