నల్సార్ వివాదంపై కీలక తీర్పు

1
- Advertisement -

లా విద్యార్థులు న్యాయవాదులుగా ఎన్‌రోల్ (సభ్యత్వం నమోదు) కాకముందు వారిపై ఎలాంటి క్రమశిక్షణా చర్యలు తీసుకునే అధికార పరిధి బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (BCI)కి లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. హైదరాబాదులోని ‘నల్సార్’ న్యాయ విశ్వవిద్యాలయం వివాదానికి సంబంధించి బార్ కౌన్సిల్ జారీ చేసిన రెండు నోటిఫికేషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది.

లా విద్యార్థుల ప్రవర్తనను నియంత్రించడానికి బిసిఐకి ఎటువంటి చట్టబద్ధమైన అధికారం లేదని, విద్యార్థులపై ఎలాంటి క్రమశిక్షణా చర్యలైనా సరే సదరు విద్యా సంస్థ మాత్రమే తన సొంత నిబంధనల ప్రకారం తీసుకోవాల్సి ఉంటుందని దేశ అత్యున్నత న్యాయస్థానం గురువారం తీర్పునిచ్చింది.

హైదరాబాద్‌లోని నల్సార్ లా యూనివర్సిటీ స్నాతకోత్సవంలో భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) పాల్గొనడాన్ని కొందరు విద్యార్థులు నిరసించిన నేపథ్యంలో తలెత్తిన వివాదంపై విచారణ సందర్భంగా చీఫ్ జస్టిస్ సూర్య కాంత్, జస్టిస్ జోయ్‌మల్య బాగ్చి మరియు జస్టిస్ వి. మోహనలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ కీలక ఉత్తర్వులు జారీ చేసింది.

అంతకుముందు, సీజేఐ రాకను వ్యతిరేకించిన నల్సార్‌ 2026 గ్రాడ్యుయేటింగ్ బ్యాచ్ విద్యార్థులను అడ్వకేట్లుగా ఎన్‌రోల్ చేయవద్దని స్టేట్ బార్ కౌన్సిళ్లను బిసిఐ ఆదేశించింది. దీనిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతో బిసిఐ ఆ ఉత్తర్వులను ఉపసంహరించుకుంది. అంతేకాకుండా బిసిఐ ఛైర్మన్ మనన్ కుమార్ మిశ్రా విద్యార్థులకు క్షమాపణలు కూడా చెప్పారు. ఈ వివాదానికి సంబంధించి బిసిఐ జారీ చేసిన నోటిఫికేషన్లను ఉపసంహరించుకున్నప్పటికీ, సుప్రీంకోర్టు వాటిని చెల్లకుండా రద్దు చేసింది. విద్యార్థులు న్యాయవాదులుగా నమోదైన తర్వాత మాత్రమే వారిపై బిసిఐకి క్రమశిక్షణా పరిధి వస్తుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

Also Read:కొండా సురేఖకు కేఏ పాల్ ఆహ్వానం

అడ్వకేట్స్ యాక్ట్ 1961 ప్రకారం ఏర్పాటైన బిసిఐకి లేదా ఏ రాష్ట్ర బార్ కౌన్సిల్‌కు లా విద్యార్థులపై క్రమశిక్షణా చర్యలు తీసుకునే ప్రత్యక్ష లేదా పరోక్ష అధికారాలను సదరు చట్టం కల్పించలేదు. సదరు చట్టం ప్రకారం పట్టభద్రుడైన వ్యక్తి అడ్వకేట్‌గా నమోదు చేసుకున్న తర్వాతే ఆ అధికారాలు వస్తాయి” అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.

- Advertisement -