భారత క్రికెటర్ డాషింగ్ బ్యాట్స్ మెన్ గా పేరున్న భారత క్రికెటర్ యువరాజ్ సింగ్‌పై గృహ హింస కింద కేసు నమోదు అవడం సంచలనం గా మారింది. యువరాజ్ సోదరుడు జరోవర్ సింగ్ భార్య ఆకాంక్ష శర్మ ఈ కేసు పెట్టారు. భర్త జరోవర్‌తో పాటు యువరాజ్ సింగ్, అత్త షబ్నం సింగ్‌పై గృహ హింస చట్టం కింద కేసు నమోదు చేసినట్లు ఆకాంక్ష తరపు న్యాయవాది స్వాతి సింగ్ మాలిక్ తెలిపారు. చాన్నాళ్ల నుంచి జరోవర్ నుంచి దూరంగా ఉంటోంది ఆకాంక్ష. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు. ఇప్పుడు ఆ కుమారుడు ఎవరి వద్ద ఉండాలన్న దానిపై కోర్టులో కేసు కూడా నడుస్తోంది.
అయితే గృహ హింస కేసులో యువరాజ్‌పై ఎలా కేసు నమోదు చేస్తారని ప్రశ్నించగా.. ‘శారీరక హింస కింద మాత్రమే ఈ కేసు నమోదు చేయరు.. మానసిక, ఆర్థిక ఒత్తిడి తీసుకువచ్చిన వారిపై కూడా ఈ కేసు నమోదు చేయవచ్చు. ఈ నేపథ్యంలో యువరాజ్ పేరు చేర్చాల్సి వచ్చింది. బిడ్డని కనాలంటూ జరోవర్, షబ్నం.. ఆకాంక్షపై ఒత్తిడి తీసుకువస్తున్నారు. ఈ విషయంలో యువీ తన కుటుంబసభ్యులకు మద్దతు పలుకుతున్నాడు. అందుకే అతని పేరు జత చేయాల్సి వచ్చింది’ అని స్వాతి చెప్పారు.
కొద్ది రోజుల క్రితం ఆకాంక్ష వద్ద ఉన్న నగలను తిరిగి ఇవ్వాలని కోరుతూ షబ్నం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై స్వాతి మాట్లాడుతూ.. ఔను, జరోవర్‌తో ఆకాంక్ష పెళ్లి అయిన తర్వాత కొనుకున్న నగలను తిరిగి ఇవ్వాల్సిందిగా షబ్నం ఫిర్యాదు చేశారు. నగలు మాత్రమే ఇవ్వాలని.. డబ్బు అవసరం లేదని షబ్నం ఫిర్యాదులో పేర్కొన్నట్లు స్వాతి చెప్పారు.