తెలంగాణ స్పూర్తితో ప్రత్యేక హోదా ఉద్యమం

271
online news portal
- Advertisement -

అసాధ్యమనుకున్న తెలంగాణను ప్రజలు ఉద్యమాలతో సాధించుకున్నారని వైసీపీ అధినేత జగన్ అన్నారు. తెలంగాణ స్పూర్తితో పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన హామీని పోరాటాల ద్వారా సాధించుకోలేమా? అంటూ జగన్ ప్రశ్నించారు. కర్నూలు యువభేరిలో మాట్లాడిన జగన్….ప్రత్యేక హోదా కోసం ఎంపీలతో రాజీనామా చేయిస్తామని ప్రకటించి సంచలనం సృష్టించారు. వచ్చే సాధారణ ఎన్నికల నాటికి ప్రత్యేక హోదా అంశాన్ని ఎన్నికల ఎజెండాగా మారుస్తామని స్పష్టం చేశారు. సమిష్టి పోరాటంతో ప్రత్యేక హోదాను కూడా సాధించుకు తీరుదామని జగన్ పిలుపునిచ్చారు.

ప్రత్యేక హోదా వస్తేనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మేలు జరుగుతుందని వైఎస్ జగన్ అన్నారు. హోదా కోసం పోరాటం కొనసాగిద్దామని, రాబోయే శీతాకాల సమావేశాల్లో పార్లమెంట్ను వైఎస్ఆర్ సీపీ ఎంపీలు స్తంభింపచేస్తారన్నారు. బడ్జెట్ సమావేశాల్లోనూ ప్రత్యేక హోదాపై పోరాడతామని, అప్పటికీ కేంద్రం స్పందించకపోతే బడ్జెట్ సమావేశాల తర్వాత ఎంపీలు రాజీనామాలు చేస్తారన్నారు. ఆ తర్వాత హోదా నినాదంతోనే ఉప ఎన్నికలకు వెళతామన్నారు. మళ్లీ గెలిచి ప్రత్యేక హోదా నినాదాన్ని పార్లమెంట్లో వినిపిస్తామని వైఎస్ జగన్ తెలిపారు.

తెలంగాణ ఉద్యమ సమయంలో టీఆర్ఎస్‌ అధినేత కేసీఆర్‌ పార్టీ ఎమ్మెల్యేలు,ఎంపీలతో పలుమార్లు రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు వెళ్లిన సంగతి తెలిసిందే. అంతేకాదు కేంద్రమంత్రి పదవులకు సైతం రాజీనామా చేసి తెలంగాణ ప్రజల ఆకాంక్షను హస్తినలో బలంగా వినిపించడంలో సక్సెస్‌ అయ్యారు. కేసీఆర్ పోరాట ఫలితంగా దశాబ్దాల తెలంగాణ ప్రజల ఆకాంక్ష నేరవేరింది. సాధించుకున్న తెలంగాణను బంగారు తెలంగాణగా మార్చేందుకు ప్రజలు సీఎం కేసీఆర్‌ నాయకత్వాన్ని బలపరుస్తు…టీఆర్ఎస్‌కు అధికారన్ని కట్టబెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు జగన్ కూడా ఇదే బాటలో ఏపీకి ప్రత్యేక హోదా కోసం రాజీనామా అస్త్రాన్ని ఎంచుకుని….ప్రజల ఆకాంక్షను వినిపించేందుకు సిద్ధమయ్యారు.

- Advertisement -