అయోధ్యలో శ్రీరాముడి ప్రాణ ప్రతిష్టాపన కోసం విగ్రహం ఎంపిక ఖరారైంది. దేశంలోని ప్రముఖ శిల్పి యోగిరాజ్ అరుణ్ చెక్కిన శ్రీరాముని విగ్రహం అయోధ్యలో ప్రతిష్టించబడుతుందని అధికారులు తెలిపారు. కర్నాటకలోని మైసూరు యోగిరాజ్ స్వస్థలం. జనవరి 22వ తేదీన అయోధ్యలో అయిదేళ్ల బాలరాముడి విగ్రహాన్ని ప్రతిష్టించనున్నారు. మధ్యాహ్నం 12.20 నిమిషాలకు ఈ కార్యక్రమం జరగనుంది.
కర్నాటకలోని కారకల ప్రాంతంలోని కృష్ణశిలపై రాముడి విగ్రహాన్ని చెక్కారు. గత ఏడాది మార్చిలో రామ్ లల్లా విగ్రహం తయారీ కోసం ఈ రాయిని ఎంపిక చేశారు. తమ కుటుంబం మొత్తం సంతోషంగా ఉందని అరుణ్ తల్లి సరస్వతి అన్నారు. తన భర్త పట్ల గర్వంగా ఉందని విజేత తెలిపారు.
తనకు మాటలు రావడం లేదని, సంతోషంగా ఫీలవుతున్నానని, గర్వంగా కూడా ఉందని అన్నారు. రామ్ లల్లాను చెక్కిన విషయాన్ని తన భర్త తనకు చెప్పలేదని, మీడియా ద్వారానే ఈ విషయాన్ని తెలుసుకున్నట్లు తెలిపారు.