పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్నవేళ తెలంగాణ కాంగ్రెస్ కు షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి. ఇటివలే ఎమ్మెల్యేలు , మాజీ ఎమ్మెల్యేలు వరుసగా అధికార టీఆర్ఎస్ లోకి వెళ్లిన విషయం తెలిసిందే. తాజాగా మారో కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆ పార్టీకి రాజీనామా చేసినట్లు ప్రకటించారు. నిజామాబాద్ జిల్లా ఎల్లారెడ్డి పేట ఎమ్మెల్యే జాజుల సురేందర్ టీఆర్ఎస్ లో చేరనున్నట్లు తెలిపారు. ఈసందర్భంగా ఆయన నిన్న సాయంత్రం ప్రగతి భవన్ లో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో భేటీ అయ్యారు. సీఎం కేసీఆర్ స్పూర్తితోనే తాను రాజకీయాల్లోకి వచ్చానని…తెలంగాణ ఉద్యమంలో తాను కేసీఆర్ వెంటే నడిచానన్నారు. అలాగే తెలంగాణ అభివృద్ది కోసం అహర్నిశలు కష్టపడుతున్న సీఎం కేసీఆర్ తోనే తాను కూడా నడవాలను భావిస్తున్నట్లు ఓ బహిరంగ లేఖ రాశారు.
ఎల్లారెడ్డి పేట నియోజకవర్గ అభివృద్ది కోసమే తాను పార్టీ మారుతున్నట్లు స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ప్రజలకు దూరమైందన్నారు. అవసరమైతే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి తాను సిద్దంగా ఉన్నానని తెలిపారు. నియోజకవర్గ ప్రజలు, కార్యకర్తల అభిప్రాయం మేరకే టీఆర్ఎస్ లో చేరుతున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన 19 మంది ఎమ్మెల్యేల్లో ఇప్పటి వరకూ 11మంది ఎమ్మెల్యేలు గులాబీ తీర్దం పుచ్చుకున్నారు. త్వరలోనే వీరి బాటలో మరో 4గురు ఎమ్మెల్యేలు రానున్నట్లు తెలుస్తుంది. ఇలాగే వలసలు కొనసాగితే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కనుమరుగయ్యేలా ఉంది.