దేశవ్యాప్తంగా జాతీయ రహదారుల (National Highways) నిర్వహణను ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు వేగవంతం చేసింది. ఇందులో భాగంగా తెలుగు రాష్ట్రాల్లో అత్యంత కీలకమైన యాదాద్రి–వరంగల్ జాతీయ రహదారి (NH-163) ప్రైవేటు రంగానికి బదిలీ కానుంది. రాబోయే 2026–27 ఆర్థిక సంవత్సరంలో దేశంలోని 17 ప్రధాన రహదారులను ప్రైవేటు కంపెనీలకు అప్పగించేలా కేంద్రం వ్యూహాత్మక ప్రణాళికను సిద్ధం చేసింది.
తెలంగాణ రాజధాని హైదరాబాద్ నుంచి వరంగల్ వైపు వెళ్లే ప్రయాణికులకు అత్యంత కీలకమైన NH–163 పరిధిలోని యాదాద్రి–వరంగల్ సెక్షన్‌ను ఈ విడతలో ప్రైవేటుకు అప్పగించనున్నారు. ఈ హైవే పరిధిలో ఉన్న కీలకమైన కోమళ్ల, కోమటిపల్లి టోల్ ప్లాజాల వసూళ్లు, నిర్వహణ బాధ్యతలను సైతం కేంద్రం ప్రైవేటు సంస్థలకే కట్టబెట్టనుంది.
కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఈ ‘రోడ్ మోనిటైజేషన్’ (రహదారుల ద్వారా ఆదాయ వనరుల సమీకరణ) ప్రక్రియలో భాగంగా దేశంలోని పలు కీలక రాష్ట్రాల నుంచి 17 హైవేలను ఎంపిక చేశారు. హరియాణ: 3 హైవేలు,జార్ఖండ్: 3 హైవేలు,మహారాష్ట్ర: 2 హైవేలు,రాజస్థాన్: 2 హైవేలు,ఉత్తరప్రదేశ్: 2 హైవేలు,తమిళనాడు: 2 హైవేలు,కర్ణాటక: 1 హైవే,బీహార్: 1 హైవే,తెలంగాణ: 1 హైవే (యాదాద్రి-వరంగల్ సెక్షన్) ఉన్నాయి.
కేంద్ర ప్రభుత్వం సాధారణంగా ‘టోల్-ఆపరేట్-ట్రాన్స్‌ఫర్’ (TOT) విధానం కింద ఇప్పటికే పూర్తయిన రోడ్లను ప్రైవేటు సంస్థలకు దీర్ఘకాలిక లీజుకు ఇస్తుంది. దీని ద్వారా ప్రభుత్వానికి ఒకేసారి పెద్ద మొత్తంలో నిధులు సమకూరుతాయి. ఈ నిధులను కొత్త ప్రాజెక్టుల నిర్మాణానికి కేటాయిస్తారు.
Also Read:మోదీకి నచ్చిన..’పెద్ది’!

