తెలుగు మహాసభల నిర్వహణపై సీఎం కేసీఆర్ ప్రగతి భవన్‌లో సమీక్ష సమావేశం నిర్వహించారు. సాహితీ వేత్తలందరితో చర్చించి సలహాలు, సూచనలు తీసుకున్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ… తెలంగాణలో జరిగిన సహిత్య సృజన ప్రస్పుటమయ్యే విధంగా తెలంగాణ సాహితీమూర్తుల ప్రతిభా పాటవాలను ప్రపంచానికి చాటి చెప్పాలన్నారు. మహాసభల సందర్భంగా హైదరాబాద్ నగరాన్ని స్వాగత తోరణాలతో అలంకరించాలి. తెలుగు పద్యాలు, సాహిత్యం వినిపించాలి. భాగ్యనగరం భాసిల్లేలా తెలుగు మహాసభల సందర్భంగా ఏర్పాట్లు చేయలన్నారు.
వచ్చిన అతిథులకు మంచి వసతి, భోజనం కల్పించాలి. ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారందరినీ ఆహ్వానించాలి. నగరంలో వివిధ వేదికలు ఏర్పాటు చేసి ఒక్కో ప్రక్రియను ఒక్కో వేదికలో ప్రదర్శించాలి. తెలుగు మహాసభల సందర్భంగా తెలుగుకు అద్భుతమైన భవిష్యత్ ఉందనే విశ్వాసం కలిగించాలి. తెలంగాణ ప్రభుత్వం ఇంటర్మీడియట్ వరకు తెలుగు సబ్జెక్టును కచ్చితంగా బోధించాలని పెట్టిన నిబంధనకు సర్వత్రా ఆమోదం లభిస్తోంది. ఉర్ధూ మీడియం పాఠశాలల్లో ఈ విధానం అమలు చేయాలని ముస్లీం పెద్దలు కోరడం మంచి పరిణామం. తెలుగు భాషను అభ్యసించిన వారికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దొరికే విధంగా అమలు చేస్తామని తెలిపారు.
తెలంగాణ భాషకు అద్భుతమైన భవిష్యత్ ఉందనే గట్టి సాంకేతాలు పంపే విధంగా అత్యంత జనరంజకంగా భాగ్యనగరం భాసిల్లేలా స్వాభిమానాన్ని ఘనంగా చాటిచెప్పేలా తెలుగు మహాసభలు నిర్వహించాలి. తెలుగు మహాసభల సందర్భంగా తెలంగాణలో జరిగిన సాహిత్య సృజన, తెలంగాణలో ఉన్న సాహిత్య పటిమ మీద ప్రధానంగా చర్చ జరగాలి. అన్ని సాహిత్య ప్రక్రియలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు, కళలకు కూడా ప్రధాన్యత ఉండాలని ప్రభుత్వం భావిస్తున్నది. తెలంగాణ ఉద్యమంలో అంతా కలిసి స్వరాష్ట్రం కోసం ఎట్ల పనిచేశామో.. అంతే పట్టుదల, సమన్వయంతో తెలుగు మహాసభలు విజయవంతం చేయాలని కోరారు.
తెలుగులో విద్యార్థులకు సామాజిక అవగాహన, నైతిక విలువలు, పెద్దల పట్ల గౌరవం పెంచే పాఠ్యాంశాలు బోధించాలని ఆదేశించారు. మహాసభలు నిర్వహించడమే కాకుండా తెలుగు భవిష్యత్‌కు సంబంధించిన సాంకేతాలు కూడా పంపాలని సూచించారు.