ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న వరల్డ్ కప్ మ్యాచ్ లు గత వారం ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఇక నేటి నుంచి ఇండియా మ్యాచ్ లు ప్రారంభంకానున్నాయి. ఇవాళ సౌతాఫ్రికాతో కోహ్లి సేన తలపడనున్నారు. అయితే ఇవాళ్టీ నుంచి వరల్డ్ కప్ లో అసలైన జోష్ రానుంది. వార్మాప్ మ్యాచ్‌ల్లో మిశ్రమ ఫలితాలు ఎదురైనా లోతైన బ్యాటింగ్.. పదునైన బౌలింగ్‌పై తిరుగులేని నమ్మకంతో ఉంది. రోహిత్‌శర్మ సామర్థ్యం.. కెప్టెన్ విరాట్ కోహ్లి సత్తా.. ఎంఎస్ ధోనీ చాణక్యం టీమ్‌ఇండియాకు పెట్టని కోటలు. ఈ ముగ్గురి చుట్టూ అల్లుకున్న ఈ జట్టు కథకు శుభారంభం అత్యంత కీలకం. మరోవైపు వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓడిన దక్షిణాఫ్రికాది చావోరేవో పరిస్థితి. మూడో మ్యాచ్‌లోనూ ఓడితే సెమీస్ అవకాశాలు సన్నగిల్లడం ఖాయం! కొంత బలహీనపడ్డట్లు కనిపిస్తున్నా ఆ జట్టును తేలిగ్గా తీసుకునే పరిస్థితి లేదు. దీంతో టీమిండియా తొలిపోరే ఆసక్తికరంగా సాగనుంది.
టీంఇండియా బ్యాటింగ్ పరంగా చూసుకుంటే ఓపెనింగ్‌లో రోహిత్ శర్మ, శిఖర్ ధావన్.. వన్‌డౌన్‌లో విరాట్ కోహ్లీ.. నాలుగో నంబరులో కేఎల్ రాహుల్.. వికెట్ కీపర్‌గా ధోని.. ఆల్‌రౌండర్‌గా హార్దిక్ పాండ్య స్థానాలకు ఢోకా లేదు. పేసర్లు ముగ్గురా? ఇద్దరా? అన్న దానిపైనే తుదిజట్టు కూర్పు ఆధారపడి ఉంటుంది. ముగ్గురు ప్రధాన పేసర్లతో బరిలో దిగితే బుమ్రా, షమి, భువనేశ్వర్ తుదిజట్టులో ఉంటారు. అప్పుడు హార్దిక్‌తో కలిపి ఆరుగురు బ్యాట్స్‌మెన్‌తో టీమ్‌ఇండియా బరిలో దిగుతుంది. స్పిన్ కోటాలో కుల్‌దీప్‌యాదవ్ లేదా చాహల్‌లలో ఒకరికి అవకాశం లభించనుండగా మిగిలిన ఒక స్థానం కోసం జడేజా, కేదార్ జాదవ్‌ల మధ్య పోటీ నెలకొంటుంది. ఇక వరల్డ్ కప్‌లో రెండు జట్లు నాలుగు మ్యాచ్‌ల్లో తలపడగా.. దక్షిణాఫ్రికా మూడు సార్లు.. ఒక దాంట్లో భారత్ నెగ్గింది. భారత్, దక్షిణాఫ్రికా మధ్య జరిగిన వన్డే వార్‌లో భారత్ 34 మ్యాచ్‌ల్లో గెలవగా.. దక్షిణాఫ్రికా 46 విజయాలు సాధించింది. 3 మ్యాచ్‌ల్లో ఫలితం తేలకుండా పోయింది.