టీమిండియా డాషింగ్ బ్యాట్స్‌మెన్ మహేంద్రసింగ్ దోనీపై ప్రశంసలు గుప్పించాడు సౌరభ్ గంగూలీ. 2003 ప్రపంచకప్ భారతజట్టులో ధోనీ ఉంటే కప్ గెలిచేవాళ్లమని చెప్పుకొచ్చాడు. 2004లో అతడు భారత క్రికెట్ జట్టులో చోటు సంపాదించాడు. ఒక్క ఏడాది ముందుగా.. మహీ జట్టులోకి వచ్చి ఉంటే.. 2003 ప్రపంచ కప్ ఆడి ఉంటే జట్టు ప్రదర్శనలో తేడా కచ్చితంగా కనిపించేదని గంగూలీ అభిప్రాయపడ్డాడు.
టీమిండియా ప్రపంచ కప్ ఫైనల్ ఆడుతున్న సమయానికి ధోనీ రైల్వేలో టికెట్ కలెక్టర్‌గా పని చేస్తున్నాడు. ఈ విషయాన్ని నమ్మకలేకపోతున్నా అని తన ఆటోబయోగ్రఫీ ‘వన్ సెంచరీ ఈజ్ నాట్ ఇనఫ్’లో రాసుకొచ్చాడు.
ఒత్తిడిలోనూ ప్రశాంతంగా ఉంటూ, మ్యాచ్ గమనాన్ని మార్చే ఆటగాళ్లు కోసం నేనెప్పుడూ వెతుకుతుండేవాడిని. 2004లో ధోని నా దృష్టికి వచ్చాడు. నా ఆలోచనలకు ప్రతిరూపం అతడు. తొలి రోజే ధోనీని చూసి ముగ్ధుడినయ్యా. అతడిపై అప్పటి నా అంచనా నిజమైనందుకు సంతోషంగా ఉందన్నాడు. ధోనీ ప్రపంచ స్థాయి ఆటగాడిగా ఎదిగాడని దాదా సంతోషం వ్యక్తం చేశాడు. భారత్‌కు ఎన్నో చిరస్మరణీయ విజయాలను అందించాడని ధోనీపై ప్రశంసల వర్షం కురిపించాడు.