ప్రస్తుతం రోజు రోజుకు చలి తీవ్రత పెరుగుతోంది. ఉదయం తొమ్మిది గంటలు దాటిన చలి తీవ్రత ఏ మాత్రం తగ్గడం లేదు. దాంతో వృద్ధులు, చిన్నపిల్లలు తరచూ జబ్బుల బారిన పడుతుంటారు. చలికాలంలో సీజనల్ గా వచ్చే వ్యాధుల తీవ్రత అధికంగానే ఉంటుంది. అలాగని ఈ సీజనల్ వ్యాధులను నిర్లక్ష్యం చేస్తే ప్రమాదమే అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ముఖ్యంగా ఈ వింటర్ సీజన్ లో ఫ్లూ వైరస్ ల కారణంగా జలుబు, దగ్గు, గొంతు నొప్పి, తలనొప్పి, వంటి సమస్యలు ఎక్కువగా వేధిస్తుంటాయి. పొడి దగ్గు, కఫం వంటివి కూడా ఫ్లూ వైరస్ లక్షణాలే. ఇవి సాధారణ సమస్యలే కదా అని నిర్లక్ష్యం చేస్తే న్యుమోనియాకు దారి తీయవచ్చు..
కాబట్టి పై లక్షణాలు కనిపిస్తే ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించాలి. ఇక ఈ చలికాలంలో శ్వాస సంబంధిత సమస్యలు వేధిస్తుంటాయి. కాబట్టి తీవ్రమైన చలి ఉన్నప్పుడు వృద్ధులు అసలు బయటకు రాకూడదు. శ్వాస తీసుకోవడంలో ఏ మాత్రం ఇబ్బంది ఏర్పడిన వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. తరచూ గొంతులో మంట, పొడి దగ్గు వంటి సమస్యలు కనిపిస్తే స్ట్రెప్టోకోకస్ బ్యాక్టీరియా వల్ల వచ్చే ఇన్ఫెక్షన్ కావొచ్చు. దీన్ని వల్ల దీర్ఘకాలిక సమస్యలు ఉత్పన్నమయ్యే ప్రమాదం ఉంది.
ఇంకా చలికాలంలో జీర్ణ సంబంధిత జబ్బులు కూడా ఎక్కువ. కొందరిలో మలబద్దకం, మలంలో రక్తం పడడం వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. వీటి విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ సమస్యలు ప్రేగు క్యాన్సర్ కు దారి తీస్తాయి. ఇంకా చలికాలంలో రోగనిరోధకశక్తి లోపించిన వారిలో చాలానే ఆరోగ్య సమస్యలు కనిపిస్తుంటాయి, జ్వరం, తలనొప్పి, అలసట, బద్దకం.. వంటి ఆరోగ్య సమస్యల తీవ్రత అధికంగా ఉంటే దీర్ఘకాలిక వ్యాధులకు కారణమవుతాయి. కాబట్టి చలికాలంలో సర్వసాధారణంగా కనిపించే జబ్బుల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
Also Read:విజయవాడ – శ్రీశైలం మధ్య ‘సీ ప్లేన్’