భాగ్యనగరంలో జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. అన్ని పార్టీల నేతలు ప్రచారంలో దూసుకెళ్తున్నారు. హామీలతో పాటు మాటల తూటాలతో నగర వాతావరణాన్ని వేడెక్కిస్తున్నారు. ఇక ఎప్పటిలాగే ఈసారి కూడా ఎన్నికల్లో మద్యం ఏరులై పారుతోంది. లిక్కర్ సేల్స్ భారిగా పెరిగాయి. ఎన్నికల ప్రచారంలో పాల్గొనే కార్యకర్తల కోసం బీరు, బిర్యానీ కామన్. ఈ క్రమంలోనే నగరంలో మద్యం అమ్మకాలు ఊపందుకున్నాయి. కార్యకర్తల కోసం నేతలు పెద్ద ఎత్తున లిక్కర్ కొనుగోలు చేస్తున్నారు. మరో 3 రోజులే ఈ సందడి ఉంటుంది. ఎందుకంటే జీహెచ్ఎంసీ పరిధిలో ఆదివారం నుంచి మద్యం అమ్మకాలు నిలిచిపోనున్నాయి. మళ్లీ ఎలక్షన్స్ తర్వాతే మద్యం దుకాణాలు ఓపెన్ అవుతాయి.
జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో నగరంలో మూడు రోజుల పాటు మద్యం దుకాణాలు మూతపడనున్నాయి. ఈ నెల 29 నుంచి డిసెంబర్ 1 వరకు గ్రేటర్ పరిధిలో మద్యం విక్రయాలపై నిషేధం విధిస్తున్నట్లు ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు జారీచేసింది. ఆదివారం సాయంత్రం 6 గంటల నుంచి మంగళవారం సాయంత్రం 6 గంటల వరకు, తిరిగి డిసెంబర్ 4న ఉదయం 6 గంటల నుంచి ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు మద్యం విక్రయాలను నిషేధిస్తున్నట్లు అందులో పేర్కొన్నారు. డిసెంబరు 1న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) ఎన్నికల పోలింగ్ జరగనుంది. డిసెంబరు 4న కౌంటింగ్ నిర్వహించి ఫలితాలను ప్రకటిస్తారు. ఇక రూ.50 నుంచి రూ.1350 వరకు వివిధ కేటగిరీల్లో మద్యం ధరలు తగ్గాయి. రూ.250 నుంచి రూ.300 ఉన్న మద్యం బాటిల్‌పై రూ.50 మేర తగ్గిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.