తనకు వల్లభనేని వంశీ ఎవరో తెలియదని స్పష్టం చేశారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన కేటీఆర్ తెలంగాణాలో భూములు ఉన్న టీడీపీ అభ్యర్థులను టీఆర్ఎస్ బెదిరిస్తుందన్న ఆరోపణల్లో నిజం లేదన్నారు. తాను వంశీ టీడీపీని వీడి.. వైసీపీలోకి రావాలని.. లేకపోతే సైలెంట్‌గా ఉండాలని వార్నింగ్ ఇచ్చినట్లు వస్తున్న వార్తలన్ని పుకార్లే అన్నారు.
వల్లభనేని వంశీ ఎవరో కూడా నాకు తెలియదు. ఆయన్ను నేను బెదిరించానట.. ఎంత దారుణమైన చిల్లర ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. సొంతంగా వెళ్లి నాలుగు ఓట్లు వేయించుకునే ఫేసు వాల్యూ లేని వాళ్లు.. ఇంకోకరి మీద పడి ఓట్లు సంపాదించుకోవాలనుకుంటున్నారు. రాజకీయాల్లో ఇంతకంటే దరిద్రం ఇంకొకటి ఉండదన్నారు. అసలు ఎవరండీ వల్లభనేని వంశీ ఆయన ఎవరో కూడ నాకు తెలియదు. నేను బెదిరించానని ఆయన మాట్లాడుతుంటే చాలా ఆశ్చర్యమేసిందని స్పష్టం చేశారు.
లోక్ సభ ఎన్నికల తర్వాత దేశ రాజకీయాల్లో ప్రాంతీయ పార్టీలు కీలకపాత్ర పోషించబోతున్నాయని చెప్పారు. జాతీయ పార్టీలుగా భావించే కాంగ్రెస్,బీజేపీ చిన్న సైజు ప్రాంతీయ పార్టీలని విమర్శించారు. కేసీఆర్ నాయకత్వం దేశానికే ఆదర్శం అని తెలంగాణ బంగారు తెలంగాణ దిశగా మారబోతుందన్నారు.