ఢిల్లీలో ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా, ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియను నిరసిస్తూ జరుగుతున్న ఆందోళనల్లో అఖిల భారత విద్యార్థి సంఘం (AISA) జాతీయ అధ్యక్షురాలు నేహా బోరా కీలకంగా మారారు. ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన పేపర్ లీక్ నిరసనల నుంచి ప్రస్తుతం కొనసాగుతున్న ఎన్నికల సంస్కరణల వ్యతిరేక ఉద్యమాల వరకు విద్యార్థుల తరఫున ఆమె గళం వినిపిస్తున్నారు. గత వారం రోజులుగా నిరసనల నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు ఆమెను పలుమార్లు అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఇప్పుడు సోషల్ మీడియాలో అంతా నేహా బోరా గురించిన చర్చే జరుగుతోంది.
29 ఏళ్ల నేహా బోరా జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (JNU)లో పీహెచ్డీ పరిశోధకురాలిగా ఉన్నారు. గత వారం సీనియర్ న్యాయవాదులు ప్రశాంత్ భూషణ్, కపిల్ సిబల్ కూడా పాల్గొన్న నిరసన ర్యాలీల్లో ఆమె చురుగ్గా వ్యవహరించారు.
నేహా బోరా స్వస్థలం ఉత్తరాఖండ్. ఢిల్లీ విశ్వవిద్యాలయంలో డిగ్రీ పూర్తి చేసిన ఆమె.. అనంతరం అంబేడ్కర్ విశ్వవిద్యాలయం ఢిల్లీలో పీజీ చదివారు. ప్రస్తుతం జేఎన్‌యూలోని స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ ఎస్తెటిక్స్లో పరిశోధన చేస్తున్నారు. విద్యార్థి దశ నుంచే క్యాంపస్ రాజకీయాల్లో చురుకుగా పాల్గొంటున్నారు.
తన రాజకీయ అభిప్రాయాలు కుటుంబ సభ్యుల ఆలోచనలకు భిన్నంగా ఉంటాయని నేహా గతంలో ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. తన కుటుంబం బీజేపీకి బలమైన మద్దతుదారులని, ఈ విషయంలో ఇంట్లో పెద్ద ఎత్తున విభేదాలు తలెత్తేవని ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. పరీక్షల్లో అక్రమాలు జరిగాయనే ఆరోపణలపై విద్యార్థులు చేపట్టిన ఉద్యమాల్లోనూ నేహా పాల్గొన్నారు. విద్యా సంస్కరణల కోసం పోరాడుతున్న సోనం వాంగ్‌చుక్‌తో కలిసి ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరవధిక నిరాహార దీక్షలో పాల్గొన్న విద్యార్థి నాయకుల్లో ఆమె ఒకరు. ఈ ఉద్యమానికి కాక్రోచ్ జనతా పార్టీ (CJP) నేతృత్వం వహించింది.
ఈ ఆందోళనల నేపథ్యంలో అప్పటి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. ఝార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఝార్ఖండ్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పరీక్షల్లో అక్రమాలు జరిగాయనే ఆరోపణలపై అక్కడ జరిగిన నిరసనల్లోనూ నేహా పాల్గొన్నారు. ఆ సమయంలో గుర్తుతెలియని వ్యక్తి ఆమెపై సిరా చల్లినట్లు ఆరోపణలు వచ్చాయి. అయినప్పటికీ వెనక్కి తగ్గకుండా ఉద్యమాన్ని కొనసాగించారు.
ఢిల్లీలో అక్టోబర్ 10న నిర్వహించ తలపెట్టిన నిరసనలకు ముందు పలువురు సీజేపీ నాయకులు, కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జంతర్ మంతర్ వద్ద నిరసనలకు అవకాశం లేకపోవడంతో నేహా ప్రత్యామ్నాయ ప్రదేశంలో ఆందోళనకు పిలుపునిచ్చారు. ఈ రోజు దిల్లీ హాట్నే జంతర్ మంతర్‌గా మార్చుకుందాం! అక్కడ కలుద్దాం!’ అంటూ ఆమె ఎక్స్‌లో పోస్టు చేశారు. అనంతరం అక్కడ జరిగిన నిరసనలో నేహాతో పాటు ఇతర కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Also Read:కిమ్ జోంగ్ ఉన్‌తో ట్రంప్ భేటీ!
సీఈసీకి వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో గత వారం పలుమార్లు పోలీసుల అదుపులోకి వెళ్లిన నేహా.. సోమవారం మరోసారి నిర్బంధానికి గురయ్యారు. ఆర్కే పురం నుంచి నిరసన ర్యాలీగా బయలుదేరిన ఏఐఎస్ఏ సభ్యులు కన్నాట్ ప్లేస్‌లోకి ప్రవేశించగలిగారు. అక్కడి నుంచి నేహా, ఇతర కార్యకర్తలు సంసద్ మార్గ్ వైపు పరుగులు తీస్తుండగా, జంతర్ మంతర్‌కు సుమారు కిలోమీటరు దూరంలోని హెచ్-బ్లాక్ వద్ద పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం నేహాతో పాటు పలువురు కార్యకర్తలను విడుదల చేశారు.

