యూపీఐ (UPI) ద్వారా రూ.2,000కు మించి చేసే కొన్ని వ్యాపార చెల్లింపులపై ఛార్జీలు విధించే నిర్ణయం దీపావళి తర్వాత అమల్లోకి రానుంది. ఈ మేరకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ప్రకటించింది. పండుగ సీజన్ను దృష్టిలో పెట్టుకుని, ఎంపిక చేసిన వ్యక్తి నుంచి వ్యాపారికి చేసే యూపీఐ లావాదేవీలపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR)ను దీపావళి తర్వాత అమలు చేయనున్నట్లు వెల్లడించింది. ఇందుకు సంబంధించిన ఖచ్చితమైన తేదీని విడిగా ప్రకటిస్తామని ఎన్పీసీఐ ఎక్స్ (X) వేదికగా తెలిపింది.
వాస్తవానికి ఈ ఛార్జీలను 2026 అక్టోబర్ 15 నుంచి అమలు చేయాలని గతంలో నిర్ణయించారు. అయితే, వాటి అమలును అక్టోబర్ 15 నుంచి వచ్చే ఏడాది జనవరి 1కి వాయిదా వేయాలనే ప్రతిపాదన పరిశీలనలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. యూపీఐ చెల్లింపులపై ప్రతిపాదిత ఛార్జీలను పూర్తిగా ఉపసంహరించుకోవాలని, వ్యాపారులు, వినియోగదారులకు డిజిటల్ చెల్లింపుల వ్యవస్థను ఉచితంగానే కొనసాగించాలని ఆర్థిక పరిశోధనా సంస్థ గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ (GTRI) గతంలో ప్రభుత్వాన్ని కోరింది.
చెల్లింపుల నియంత్రణ విధానం ప్రకారం, రూ.2,000కు మించిన ఎంపిక చేసిన వ్యాపార యూపీఐ లావాదేవీలపై 0.4 శాతం మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) విధించాలని ప్రతిపాదించారు. ఈ ఛార్జీలను వ్యాపార లావాదేవీలకు మాత్రమే వర్తింపజేయనున్నారు. వ్యక్తుల మధ్య జరిగే సాధారణ యూపీఐ చెల్లింపులపై ఈ ప్రకటనలో ఎలాంటి ఛార్జీలను ప్రస్తావించలేదు.
Also Read:కిమ్ జోంగ్ ఉన్తో ట్రంప్ భేటీ!
ధన్తేరస్, దీపావళి సందర్భంగా మార్కెట్లలో డిజిటల్ చెల్లింపులు రికార్డు స్థాయిలో జరిగే అవకాశం ఉండటంతో, ఈ సమయంలో కొత్త ఛార్జీలను అమలు చేస్తే వ్యాపారుల్లో గందరగోళం ఏర్పడే ప్రమాదం ఉందనే ఆందోళనలు వ్యక్తమయ్యాయి.

