డోనాల్డ్ జాన్ ట్రంప్.. కఠినమైన సవాళ్లను ఎదుర్కొని, బలమైన ప్రత్యర్థిని చిత్తుచేసిన విజేత. అమెరికా 45వ అధ్యక్షుడిగా అగ్రరాజ్యం భవిష్యత్తును నిర్ణయించబోయే ప్రజానేత. మంగళవారం రాత్రి నుంచి వెలువడుతున్న ఫలితాలలో ట్రంప్ టోర్నడోను చూసి ‘ఇన్నాళ్లూ కంపు వ్యాఖ్యలు చేసిన ఇతనేనా గెలిచింది?’ అని విస్తుపోయిన చాలామంది.. నిదానంగా చేదు నిజాన్ని జీర్ణం చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఇంతకీ ఈ ట్రంప్ ఎవరు.. ఎలా ఇంత ప్రభంజనం సృష్టించాడో చదవండి..
‘బార్న్ విత్ గోల్డ్ స్పూన్’ అంటారు కదా, డోనాల్డ్ జాన్ ట్రంప్ కూడా అలాంటి సంపన్న కుటుంబంలోనే పుట్టాడు. ఫ్రెడ్ ట్రంప్, మేరీల నాలుగో సంతానంగా 1946, జూన్ 14న న్యూయార్క్ శివారు క్వీన్స్ లో జన్మించాడు. ట్రంప్ తండ్రివి జర్మన్ మూలాలుకాగా, తల్లి పూర్వీకులది స్కాట్ లాండ్. ఏడెనిమిది తరాల కిందటే ట్రంప్ కుటుంబం అమెరికాకు వలసవచ్చింది. ప్రెడ్ ట్రంప్ న్యూయార్క్ కేంద్రంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాడు. కాలం క్రమంలో ‘ఎలిజబెత్ ట్రంప్ అండ్ సన్స్’ స్థాపించి లాభాలు గడించాడు. న్యూయార్క్ లోనే పుట్టి పెరిగిన డోనాల్డ్ ట్రంప్.. యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా అనుబంధ వార్టన్ స్కూల్ నుంచి 1968లో ఎకనామిక్ పట్టాపుచ్చుకున్నారు.
డిగ్రీ పట్టా తీసుకున్నాక 1971లో వ్యాపార పగ్గాలను స్వీకరించాడు ట్రంప్. సంస్థ పగ్గాలు చేపట్టగానే ట్రంపు చేసిన మొదటి పని సంస్థ పేరును ది ట్రంప్ ఆర్గనైజేషన్‌గా మార్చేశారు. అమెరికాలోనే పలు ప్రముఖ భవనాలు ట్రంప్ నిర్మించారు. వీటిల్లో ట్రంప్ ఓషన్ క్లబ్, ట్రంప్ టవర్, సెంట్రల్ పార్క్‌లోని వూల్మాన్ రింక్ హోటల్ ఉన్నాయి. తర్వాత ప్లాజా హోటల్, అట్లాంటిక్ సిటీలోని తాజ్‌మహల్ కేసినోలను కొనుగోలు చేశారు.ఈ క్రమంలో పెద్ద మొత్తంలో సంపదనూ పోగేశారు.
రియాలిటీ రంగంలో బాగా సంపాదించాక ట్రంప్ చూపు ఎంటర్ టైన్ మెంట్ రంగం వైపునకు మళ్లింది. టీవీ షోలు నిర్మించన ట్రంప్.. స్వయంగా ‘ది అప్రెంటిస్’అనే కార్యక్రమానికి హోస్ట్ గానూ వ్యవహరించాడు. 2004-2015 మధ్య కాలంలో ఎన్ బీసీ చానెల్ లో ఈ కార్యక్రమం ప్రసారమైంది.
అందాల పోటీలపైనా మక్కువ చూపించే ట్రంప్.. 1996 నుంచి 2015దాకా జరిగిన ‘మిస్ యూఎస్ఏ’ పోటీలు అన్నింటికీ హాజరయ్యారు. ఎక్కువ సార్లు మిస్‌వరల్డ్, మిస్ యూనివర్స్ పోటీలను ప్రమోట్ చేసిన వ్యక్తిగా ఆయన ఘనత సాధించారు. 2006 మిస్ అమెరికా కిరీట విజేత తారా కొకైన్ వాడిందని తెలిసినా ఆమెను విజేతగా కొనసాగించాలనే ట్రంప్ నిర్ణయం విమర్శలపాలైంది. ఈ పోటీ పక్షపాతంతో కొనసాగిందని పోటీలో పాల్గొన్న యువతి ఆరోపించింది. ఆమెపై కేసువేసి ట్రంప్ ఐదు మిలియన్ డాలర్లను రాబట్టారు.
ట్రంప్ దగ్గరున్న సంపద ఎంతుందంటే.. అమెరికాలో అత్యంత ధనవంతుల జాబితాలో ట్రంప్ స్థానం 156. ప్రఖ్యాత ఫోర్బ్స్ పత్రిక 2015లో వెల్లడించిన వివరాల ప్రకారం ట్రంప్ ప్రపంచ కుబేరుల్లో 324వ స్థానంలో ఉన్నాడు. ఈ లెక్కన అతని సంపద ఎంతో మీరే ఊహించుకోవచ్చు.
డబ్బుతోపాటు పేరు కూడా సంపాదించిన తర్వాత రాజకీయ రంగప్రవేశం చేయాలనుకున్న ఆయన..1988, 2004, 2012, అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం ప్రయత్నించగా.. న్యూయార్క్ గవర్నర్ పదవిపై 2006, 2014లో దృష్టి పెట్టారు. కానీ ఆయన ప్రత్యక్షంగా రేసులోకి రాలేదు. పలు ప్రయత్నాల అనంతరం 2015 జూన్ 16న అమెరికా అధ్యక్ష పదవి కోసం ఆయన అభ్యర్థిత్వాన్ని ప్రకటించుకున్నారు. మళ్లీ అమెరికాను ఉన్నత స్థానానికి చేరుస్తాను అనే నినాదంతో ఆయన ప్రచారం ప్రారంభించారు. మూడు సార్లు నిర్వహించిన జనరల్ ఎలక్షన్ డిబేట్స్‌లోను హిల్లరీ ఆధిపత్యం స్పష్టంగా కనిపించినా ఆయన ఏ మాత్రం వెరవకుండా ప్రచారం చేశారు. రిపబ్లికన్లు తనను వీడి వెళుతున్నా లెక్కచేయకపోవడం ట్రంప్ శైలికి నిదర్శనం. అంతిమంగా ఆయన అనుకున్నది సాధించారు. అమెరికా 45వ అధ్యక్షుడిగా అవతరించారు.