వాట్సప్ కొత్త ప్రైవసీ పాలసీపై కీలక నిర్ణయం తీసుకుంది. వినియోగదారుల భద్రతకే తొలి ప్రాధాన్యం ఇస్తున్నట్లు వాట్సాప్ తెలిపింది. ఇటీవల కంపెనీ తీసుకువచ్చిన నూతన ప్రైవసీ పాలసీ విధానంపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం తెలుపుతూ లేఖ రాసిన విషయం తెలిసిందే. ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సప్ కొత్త ప్రైవసీ పాలసీపై గందరగోళం నెలకొన్న విషయం తెలిసిందే. వాట్సప్ కొత్త పాలసీపై కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పటికే అభ్యంతరాలు వ్యక్తం చేసింది. కేంద్ర ఐటీ శాఖ పలు ప్రశ్నలతో నోటీసును పంపి, 15 రోజుల్లో సమాధానం చెప్పాలని ఇటీవల ఆదేశించింది.
దీనిపై వాట్సప్ స్పందిస్తూ.. భారత ప్రభుత్వం పంపిన లేఖపై తమ సమాధానం ఇచ్చామని వివరించింది. వినియోగదారుల గోప్యతే తమకు ప్రధానమని భారత ప్రభుత్వానికి హామీ ఇచ్చామని పేర్కొంది. తాము తీసుకొచ్చిన ప్రైవసీ పాలసీ వల్ల యూజర్ల వ్యక్తిగత సందేశాల గోప్యతకు భంగం కలగదని తెలిపింది. సమీప భవిష్యత్తులో తమ కార్యాచరణలో ఎలాంటి మార్పులూ ఉండబోవని స్పష్టం చేసింది. తమ యూజర్లకు ప్రైవసీ పాలసీ గురించి అప్‌డేట్లు ఇస్తూనే ఉంటామని పేర్కొంది.