కొన్ని కొన్ని రెస్టారెంట్స్ రుచికరమైన ఫుడ్‌ని అందిస్తూ పాపులర్ అవుతాయి. మరికొన్ని మాత్రం ఆ రెస్టారెంట్ కి పెట్టిన పేరుతోనే పాపులర్ అవుతాయి. సరిగ్గా ఇదే ఐడియాని వాడుకున్నారు ఆ రెస్టారెంట్ యజమాని. ఇక్కడ యజమాని ఎవరనేది పక్కనపెడితే.. ముంబయిలోని ఓ రెస్టారెంట్ పేరు మాత్రం ఇప్పుడు ఫుల్ పాపులర్ అవుతోంది.
ఎందుకంటే.. ఆ రెస్టారెంట్‌కి సినిమా డైలాగ్‌నే పేరుగా పెట్టేశారు. ఇంతకీ ఆ సినిమా ఏంటంటే.. షారుక్ ఖాన్, దీపిక పదుకొణె నటించిన ‘చెన్నై ఎక్స్‌ప్రెస్’. ఈ చిత్రంలో దీపిక.. షారుక్ నిద్రిస్తున్నప్పుడు ఉన్నట్టుండి ‘తంగబలి..’ అంటూ చెప్పే ఓ ఫన్నీ డైలాగ్ ఉంటుంది. ఈ తంగబలి పేరుతోనే ముంబయిలో ఓ రెస్టారెంట్ వచ్చేసింది.
అయితే ..ఇటీవల వార్తలకు దూరంగా ఉంటున్న దీపిక.. తాజాగా ఒక ఆసక్తికర విషయాన్ని చెప్పుకొచ్చింది. దీపిక కారులో తన ఫ్లాట్‌కి వెళుతున్నప్పుడు దారిలో ఈ తంగబలి రెస్టారెంట్‌ని చూసిందట.. ఇంకేముందీ…అప్పుడెప్పుడో ఆమె నటించిన ఒక సినిమాకు సంబంధించిన డైలాగ్ తో ఏకంగా ఒక రెస్టారెంట్ నే పెట్టడం చూసి సర్ ప్రైజ్ గా ఫీలైందట.
అంతేకాకుండా తంగబలి పేరును చూసిన వెంటనే దీపిక నవ్వు ఆపుకోలేకపోయిందట. తనను ఇంతగా నవ్వించిన ఈ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది.
రెస్టారెంట్ పేరు చాలా ఫన్నీగా ఉందని.. నవ్వు ఆపుకోలేకపోయానని.. త్వరలోనే తాను ఆ రెస్టారెంట్ కు వెళ్లనున్నట్లుగా చెప్పింది. దీపిక వెళ్లటం సంగతి అటుంచితే..అమ్మడి కంటపడి.. మొత్తానికి ఓవర్ నైట్ లోనే ఈ రెస్టారెంట్ పాపులర్ అయిపోయిందనటంలో సందేహం లేదు.