కోల్‌కతాలో 69 మంది ప్రాణాలను బలిగొన్న 1993 నాటి బౌబజార్ పేలుళ్ల కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న రషీద్ ఖాన్ విడుదలను సవాల్ చేస్తూ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం గురువారం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అతడి విడుదలను నిరోధించేందుకు తక్షణమే జోక్యం చేసుకోవాలని న్యాయస్థానాన్ని కోరింది.
ఈ వ్యవహారాన్ని భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) సూర్యకాంత్ ముందు ప్రస్తావించిన రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది.. జూన్ 5న ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై తాము దాఖలు చేసిన పిటిషన్‌ను త్వరగా విచారించాలని కోరారు. ఇది తీవ్రమైన ఉగ్రవాద నేరమని, స్టేట్ సెంటెన్స్ రివ్యూ బోర్డ్ (SSRB) రషీద్ ఖాన్ క్షమాభిక్ష (రెమిషన్) పిటిషన్‌ను పదేపదే తిరస్కరించినప్పటికీ..హైకోర్టు అతని ముందస్తు విడుదలకు ఆదేశించడం పొరపాటని వాదించారు.
ఈ నేరం చాలా తీవ్రమైనది అని పేర్కొన్న ప్రభుత్వ న్యాయవాది….ఈ కేసును త్వరగా విచారించి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. ఈ సంక్షిప్త విచారణ సందర్భంగా ఖాన్ ఎంతకాలంగా జైలులో ఉన్నారని సీజేఐ ప్రశ్నించారు. కస్టడీలో ఉండగా పొందిన రెమిషన్‌తో కలుపుకుని ఖాన్ దాదాపు 30 ఏళ్ల జైలు శిక్ష అనుభవించాడని న్యాయవాది బదులిచ్చారు. వాదనలు విన్న సీజేఐ ఈ కేసును లిస్ట్ చేసే (విచారణకు స్వీకరించే) అంశాన్ని పరిశీలిస్తామని అంగీకరించారు.
72 ఏళ్ల వయసున్న దోషిలో సత్ప్రవర్తన కనిపిస్తున్నప్పుడు, గతంలో చేసిన నేర తీవ్రతను మాత్రమే సాకుగా చూపుతూ ఇంకా జైలులో ఉంచడం సమర్థనీయం కాదని తెలుపుతూ కొద్ది వారాల క్రితం ఢిల్లీ హైకోర్టు అతడి విడుదలకు ఆదేశాలు జారీ చేసింది.
జూన్ 5న వెలువరించిన తీర్పులో జస్టిస్ నీనా బన్సాల్ కృష్ణ.. ఖాన్‌కు క్షమాభిక్ష ప్రసాదిస్తూ అతన్ని తక్షణమే విడుదల చేయాలని ఆదేశించారు. దోషి ఇప్పటికే అనుభవించిన శిక్ష సరిపోతుందని హైకోర్టు అభిప్రాయపడింది. ఇంతటి తీవ్రమైన నేరానికి పాల్పడిన దోషికి.. అతను ఇప్పటికే అనుభవించిన శిక్ష తగిన గుణపాఠంగా సరిపోతుంది అని హైకోర్టు తన తీర్పులో పేర్కొంది.
1993లో కోల్‌కతాలోని రద్దీగా ఉండే బౌబజార్ ప్రాంతంలో జరిగిన పేలుళ్లలో కీలక పాత్ర పోషించినందుకు రషీద్ ఖాన్‌ను 2001లో భారతీయ శిక్షాస్మృతి (IPC)… పేలుడు పదార్థాల చట్టం మరియు ఇప్పుడు రద్దు చేయబడిన ‘టాడా’ (TADA) చట్టం కింద దోషిగా నిర్ధారించారు.
Also Read:అమెరికా-ఇరాన్..చారిత్రాత్మక శాంతి ఒప్పందం
కోల్‌కతా నగరంలో జరిగిన అత్యంత ఘోరమైన ఉగ్రవాద దాడుల్లో ఒకటైన ఈ పేలుళ్లలో 69 మంది మరణించగా, పలువురు గాయపడ్డారు. ఖాన్ శిక్షను ఆ తర్వాత సుప్రీంకోర్టు కూడా సమర్థించింది. 1993లో అరెస్టయినప్పటి నుంచి ఖాన్ జైలులోనే శిక్ష అనుభవిస్తున్నాడు.నేరస్థుల్లో పరివర్తన, పునరావాసానికి రాజ్యాంగం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని తెలుపుతూ దశాబ్దాల క్రితం చేసిన నేర తీవ్రతను మాత్రమే కారణం చూపుతూ అతడిని జైలులో కొనసాగించడాన్ని సమర్థించలేమని కోర్టు స్పష్టం చేసింది. అయితే హైకోర్టు విడుదల ఉత్తర్వులను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

