మళ్లీ తెరపైకి ‘డీలిమిటేషన్ బిల్లు’?

4
- Advertisement -

డీలిమిటేషన్ బిల్లు మళ్లీ ప్రభుత్వ ఎజెండాలోకి వచ్చిందని….రాబోయే వర్షాకాల సమావేశాల్లో దీనిని పార్లమెంటులో ప్రవేశపెట్టే అంశాన్ని కేంద్రం పరిశీలిస్తోందని కేంద్ర మంత్రి రామ్‌దాస్ అథవాలే తెలిపారు. తృణమూల్ కాంగ్రెస్ (TMC), శివసేన (ఉద్ధవ్ బాలాసాహెబ్ థాకరే – UBT) వంటి ప్రతిపక్ష పార్టీలు చీలికలను ఎదుర్కొంటున్న తరుణంలో మోదీ ప్రభుత్వం డీలిమిటేషన్ బిల్లును పార్లమెంటులో మరోసారి ప్రవేశపెట్టాలని భావిస్తోందని కేంద్ర మంత్రి తెలిపారు.

రాజ్యాంగ సవరణ బిల్లు 2026 లేదా డీలిమిటేషన్ బిల్లును ఏప్రిల్‌లో జరిగిన బడ్జెట్ సమావేశాలలో ప్రవేశపెట్టినప్పటికీ అది లోక్‌సభలో నెగ్గలేకపోయింది. అయితే అథవాలే తెలిపిన వివరాల ప్రకారం.. ఈసారి పరిస్థితి ఎన్డీఏ (NDA) కు అనుకూలంగా మారనుంది అని తెలపడం విశేషం.

మమతా బెనర్జీకి చెందిన టీఎంసీలో చీలిక రావడం, అలాగే శివసేన (UBT) కు చెందిన ఆరుగురు ఎంపీలు ఎన్డీఏలో చేరాలని నిర్ణయించుకుంటే లోక్‌సభలో అధికార సంకీర్ణ బలం పెరుగుతుంది. తద్వారా ప్రభుత్వం ఈ బిల్లును మళ్లీ ప్రవేశపెట్టడానికి మార్గం సుగమం అవుతుంది. అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) కి చెందిన పలువురు లోక్‌సభ సభ్యులు కూడా ఎన్డీఏలో చేరే అవకాశం ఉందని అథవాలే పేర్కొన్నారు.

కాంగ్రెస్‌తో తన దశాబ్దాల నాటి పొత్తుకు డీఎంకే ముగింపు పలకడం కూడా ఎన్డీఏకు అనుకూలంగా మారుతుందని ఆయన అన్నారు. తొమ్మిది మంది ఎంపీలలో ఆరుగురు ఏక్‌నాథ్ షిండే వైపు వచ్చారు. దీంతో మహారాష్ట్రలో మా ఎన్డీఏ, మహాయుతి బలం పెరిగింది అని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అన్నారు.

రాబోయే పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో రాజ్యాంగ సవరణ బిల్లును తిరిగి ప్రవేశపెట్టాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏకు లోక్‌సభలో 293 మంది సభ్యులు ఉన్నారు.టీఎంసీ రెబల్ వర్గం మద్దతుతో ఎన్డీఏ బలం మరో 20 పెరిగే అవకాశం ఉంది. శివసేన (UBT) లో మరోసారి చీలిక వస్తే ఈ సంఖ్య మరింత పెరుగుతుంది. అంతేకాకుండా 22 మంది లోక్‌సభ సభ్యులున్న డీఎంకే, ‘ఇండియా (INDIA)’ కూటమికి దూరం కావడం ఎన్డీఏకు కలిసొచ్చే ప్రధాన అంశం.

Also Read:అమెరికా-ఇరాన్..చారిత్రాత్మక శాంతి ఒప్పందం

డీలిమిటేషన్ విషయంలో ఈసారి డీఎంకే…ఎన్డీయే ప్రభుత్వానికి మద్దతు ఇచ్చే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. అదే జరిగితే దిగువ సభలో ఎన్డీఏ సంఖ్యాబలం మరింత పెరిగి, బిల్లు సునాయాసంగా ఆమోదం పొందవచ్చని అంచనా వేస్తున్నారు.

- Advertisement -