ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతానికి రెండో అంతర్జాతీయ విమానాశ్రయంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ (జెవర్) తొలి వర్షాలకే జలమయమైంది. ఈ ఏడాది మార్చి 28న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా ప్రారంభమైన ఈ విమానాశ్రయంలో ఇటీవల కురిసిన చిన్నపాటి వర్షానికే నీరు చేరడం తీవ్ర వివాదాస్పదంగా మారింది.
వర్షపు నీటితో నిండిన అండర్‌పాస్, పార్కింగ్ ఏరియా:కురిసిన వర్షానికి ఎయిర్‌పోర్ట్ టెర్మినల్‌ను, పార్కింగ్ ప్రాంతాన్ని కలిపే అండర్‌పాస్ మరియు పరిసర ప్రాంతాలు నీటమునిగాయి. విమానాశ్రయానికి వచ్చిన ప్రయాణికులు వర్షపు నీటిలోనే నడుచుకుంటూ వెళ్లాల్సి రావడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్ల నుంచి నెగెటివ్ కామెంట్లు, విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
నోయిడా ఎయిర్‌పోర్ట్‌ను రూ. 29,000 కోట్లకు పైగా అంచనా వ్యయంతో విడతల వారీగా అభివృద్ధి చేసేలా ప్రణాళిక రచించారు (మొదటి దశ నిర్మాణం సుమారు రూ. 11,200 కోట్లతో పూర్తయింది). ఇంత భారీ బడ్జెట్‌తో అత్యాధునిక డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేశామని ప్రకటించినప్పటికీ మొదటి వర్షానికే ఇలా నీరు నిలిచిపోవడం నిర్మాణ నాణ్యతపై, అధికారుల నిర్వహణపై అనుమానాలను రేకెత్తిస్తోంది.
Also Read:మ్యారేజ్ డే..మొక్కలు నాటిన సంతోష్ దంపతులు
ఈ ఘటనపై ఎయిర్‌పోర్ట్ అధికారులు స్పందిస్తూ…తక్కువ సమయంలో భారీ వర్షం కురవడం వల్ల తాత్కాలికంగా నీరు చేరిందని వివరణ ఇచ్చారు. వెంటనే ప్రత్యేక బృందాలను రంగంలోకి దించి 30 నిమిషాల్లో నీటిని తొలగించామని, ప్రయాణికులకు ప్రత్యామ్నాయ మార్గాలను ఏర్పాటు చేశామని తెలిపారు. విమాన సర్వీసులకు ఎటువంటి అంతరాయం కలగలేదని భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

