తెలంగాణ రాష్ట్రానికి రెండవ రాజధానిగా వెలుగొందుతున్న వరంగల్ నగరంలో ఒక సినీ స్టూడియో నిర్మించాల్సిన అవసరం ఉందని, ఇందుకు ఐదు ఎకరాల స్థలాన్ని కేటాయించాలని వరంగల్ ఫిలిం ఫెడరేషన్ ప్రతినిధులు రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కు విజ్ఞప్తి చేశారు.
హన్మకొండలోని మంత్రి క్యాంపు కార్యాలయం ఆర్ అండ్ బి అతిథిగృహంలో లో ఆ ఫెడరేషన్ అధ్యక్షుడు కరాటే ప్రభాకర్, కార్యదర్శి తాళ్ల పెళ్లి దామోదర్ గౌడ్ ల నేతృత్వంలో పలువురు కలిసి ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. గతంలో కౌండిన్య స్టూడియోస్ నిర్మాణానికి చేసిన దరఖాస్తుకు జిల్లా కలెక్టర్ సానుకూలంగా స్పందించారని వారు తెలిపారు. అయితే సంబంధిత 5 ఎకరాల స్థలం కేటాయింపు ఇంకా జరగలేదని వారు మంత్రి దృష్టికి తెచ్చారు.
వరంగల్ లో గతంలో అనేక సినిమా షూటింగులు జరిగాయని వారు చెప్పారు. వరంగల్ లో కనీసం ఒక్క పాట నైనా షూట్ చేస్తే ఆ సినిమా కచ్చితంగా హిట్ అవుతుందన్న సెంటిమెంటు సినీ ప్రపంచంలో బలంగా ఉందన్నారు. ఈ నేపథ్యంలో షూటింగులకు, అనువైన లొకేషన్ల తో, చారిత్రక ప్రదేశాలతో ఎంతో అనుకూలంగా ఉన్న వరంగల్ నగరంలో లో ఒక స్టూడియో ఉంటే, సినీ కళాకారులకి నిర్మాతలకు ఎంతో మేలు జరుగుతుందని వారు వివరించారు. మంత్రి చొరవ తీసుకుని సినీ స్టూడియో నిర్మాణానికి సహకరించాలని వారు ఒక విజ్ఞాపన పత్రాన్ని మంత్రికి సమర్పించారు.