ఆహ్లాదం,వాకింగ్ ,రిలాక్స్, ఇలాంటి వాటి కోసం సాధారణంగా పార్క్ కు వెళుతుంటారు చాలా మంది. అయితే..తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూర్ లోని అగ్రికల్చరల్ యూనివర్సిటీ అధికారులు పార్క్‌లోకి ఎంటరవ్వాలంటే కొన్ని షరతులు పెట్టారు.
పార్క్ లో ఎంట్రీకి మ్యారేజ్ సర్టిఫికెట్ రూల్ తీసుకొచ్చారు. దీనంతటికీ కారణం కుర్రజంటే అంటున్నారు అధికారులు. అక్కడి పార్క్ కుర్ర జంటలకు వేదికగా, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతోందని ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.
వివరాల్లోకి వెళితే..మరుధమాలియా రోడ్డులో వర్సిటీ ఆధ్వర్యంలో బొటానికల్ గార్గెన్ ఉంది. ఇందులో వేలాది మొక్కలు, పక్షులు ఉన్నాయి. స్వచ్ఛమైన గాలి కోసం ఇక్కడికి వేలాది మంది వస్తుంటారు. ఇటీవల బొటానికల్ గార్డెన్ లోకి కాలేజీ విద్యార్థులు కూడా వస్తున్నారు. పార్క్ మొత్తం జంటలే. ఎక్కడ చూసినా కుర్రకారు జోరు. దీంతో అనేక కంప్లయింట్స్ వస్తున్నాయి. దీనికితోడు కాలేజీలు ఎగ్గొట్టి.. ఈ పార్క్ లో షికార్లు చేస్తున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని వర్సిటీ అధికారులు కొత్త రూల్ తీసుకొచ్చారు.
పార్క్ లోకి జంటలు రావాలంటే మ్యారేజ్ సర్టిఫికెట్ ఉండాలనే నిబంధన పెట్టారు. సింగిల్ గా వస్తే మాత్రం ఆధార్ వివరాలు, ఫోన్ నెంబర్ ఇవ్వాలనే కండీషన్ పెట్టారు. పార్క్ లో కుర్ర జంటలు కనిపిస్తే వారి వివరాలు సేకరించి పోలీసులకు సమాచారం ఇస్తామని వార్నింగ్ ఇస్తున్నారు. జంటలకు మ్యారేజ్ సర్టిఫికెట్, ఒంటరిగా వస్తే వ్యక్తిగత వివరాలు సమర్పించాలనే నిబంధన పెట్టిన ఏకైక పార్క్ గా కోయంబత్తూరు బొటానికల్ గార్గెన్ రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ నిబంధన వల్ల పార్క్ లో అసాంఘిక కార్యకలాపాలు తగ్గుతాయని.. ఫ్యామిలీస్ కు ప్రాధాన్యం పెరుగుతుందని వెల్లడించారు ప్రొఫెసర్ ఎం.కన్నన్.