తమిళనాడు కోయంబత్తూరులో కేటీఆర్ పర్యటన…

259
KT R visits Tiruvuru and Palladam
- Advertisement -

టెక్స్ టైల్ రంగంలో దేశంలోనే అగ్రగామిగా ఉన్న తమిళనాడు కొయంబత్తూరులో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి తారకరామా రావు పర్యటించారు. తిరుపూర్, పల్లడంలోని టెక్స్ టైల్ పరిశ్రమలు సాధించిన విజయాలు, ప్రగతి, సాంకేతిక పరిజ్ఞానం, మార్కెటింగ్ స్ట్రాటజీ , ప్రైవేటు భాగస్వామ్యం, ప్రభుత్వ విధానాలు, ప్రోత్సాహకాల అధ్యయనమే లక్ష్యంగా మంత్రి పర్యటన సాగింది. ముందుగా 35 వేల కోట్ల రూపాయల విలువైన వస్త్ర పరిశ్రమగా ఎదిగిన చిన్న గ్రామం తిరుపూర్ ను మంత్రి సందర్శించారు. అక్కడి నేతన్నలు, కార్మికులతో మాట్లాడారు. ఆ తర్వాత తిరుపూర్ ఎక్స్ పోర్టర్స్ అసోసియేషన్ [TEA] ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.

KT R visits Tiruvuru and Palladam

మనదేశంతో పాటు విదేశాలకు కూడా వస్త్రాలను ఎగుమతి చేస్తున్న తిరుపూర్ సక్సెస్ స్టోరీని తెలుసుకున్నారు. ఇక్కడ టెక్స్టైల్ క్లస్టర్ అభివృద్ది కోసం అమలుచేసిన వ్యూహాలు,మార్కెటింగ్ ప్లాన్స్ పై ప్రతినిధులతో చర్చించారు. పూర్తిగా ప్రైవేటు భాగస్వామ్యంలోనే తిరుపూర్ టెక్స్ టైల్ ఇండస్ట్రీ విజయాలు సాధించిందని మంత్రికి ప్రతినిధులు వివరించారు. తెలంగాణ ప్రభుత్వం వరంగల్ లో ఏర్పాటుచేయబోతున్న మెగా టెక్స్ టైల్ పార్క్ గురించి మంత్రి వారికి వివరించారు. తిరుపూర్ పరిశ్రమ సాధించినట్టుగానే ZLD [ZERP LIQUID DISCHARGE] తాము ప్రారంభించబోయే వరంగల్ పార్క్ కూడా తొలి రోజు నుంచే ZLD గా ఉండబోతుందని తెలిపారు.

TEA ప్రతినిధులు తమ ఎక్స్ పీరియన్స్ తో పాటు నాలెడ్జ్ షేరింగ్ కు ముందుకురావాలని కోరారు. తిరుపూర్ లో ఉన్న వస్త్ర పరిశ్రమలు తమ విస్తరణ ప్రణాళికలో వరంగల్ కే తొలి ప్రాధాన్యత ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. తిరుపూర్ పారిశ్రామిక వేత్తలు కోరినట్టుగా 50 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ప్లగ్ అండ్ ప్లే కు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు. ఆ పార్క్ లో పెట్టుబడులు పెట్టే కంపెనీలకు దేశంలోనే అత్యుత్తమ ప్రోత్సాహకాలతో ప్యాకేజీ ఇచ్చేందుకు తమ ప్రభుత్వం సిద్దంగా ఉందని మంత్రి ప్రకటించారు.

KT R visits Tiruvuru and Palladam

వరంగల్ టెక్స్ టైల్ పార్క్ లో కార్మికులు, ఇన్వెస్టర్లకు హౌజింగ్ , విద్య, ఆరోగ్యం తో పాటు అన్ని మౌలిక వసతులు కల్పిస్తామని హామి ఇచ్చారు. ఇంతేకాదు TEA ప్రతినిధులకు ప్రత్యేకంగా ఒక బ్లాక్ కేటాయిస్తామన్నారు. మంత్రి హామి పై హర్షం వ్యక్తం చేసిన TEA ప్రతినిధులు వరంగల్ టెక్స్ టైల్ పార్క్ లో కనీసం పది యూనిట్ల ఏర్పాటుకు సూత్రప్రాయ అంగీకారం తెలిపారు. టెక్స్ టైల్ పరిశ్రమపై మంత్రి కేటీఆర్ కు ఉన్న అవగాహన, తపన తమను కట్టిపారేసిందని TEA ప్రతినిధులు ప్రశంసించారు. టెక్స్ టైల్ రంగంపై ఇంత పరిజ్ఞానం, దూరదృష్టి ఉన్న నాయకుడిని చూడలేదన్నారు. టెక్స్ టైల్ పరిశ్రమ అభివృద్ధి కి జాతీయస్థాయిలో ఏమైనా సహాయ సహకారాలు కావాలంటే తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని TEA ప్రతినిధులకు మంత్రి భరోసా ఇచ్చారు.

పల్లడం హైటెక్ వీవర్స్ పార్క్ సందర్శన
తిరుపూర్ నుంచి పల్లడం హైటెక్ వీవర్స్ పార్క్ కు మంత్రి కేటీఆర్ వెళ్లారు. చేనేత నుంచి మరమగ్గాల వైపు నేతన్నలను తీసుకొచ్చి వారి జీవనోపాధి పెంచడం ఈ పార్క్ ప్రత్యేకత. అసలు పల్లడం పార్క్ ఎలా ఏర్పాటుచేసిన్రు? ఎవరెవరు ఇన్వెస్ట్ చేసిన్రు? ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రోత్సాహకాలు అందాయో మంత్రి తెలుసుకున్నారు. సిరిసిల్ల పార్క్ ను పల్లడం మోడల్ లో అభివృద్ధి చేసే అంశాన్ని పరిశీలించాలని అధికారులను కేటీఆర్ ఆదేశించారు.

KT R visits Tiruvuru and Palladam
PSG తో MOU
టెక్స్ టైల్ ఇంజనీరింగ్ విద్యలో ప్రముఖ విద్యాసంస్థ ఐన కోయంబత్తూర్ కు చెందిన PSG తో తెలంగాణ ప్రభుత్వం MOU కుదర్చుకుంది. వరంగల్ లో ఏర్పాటుచేయబోయే టెక్స్ టైల్ పార్క్ ఏర్పాటులో పరస్పర భాగస్వామ్యం, అకాడమిక్- టెక్నికల్ అసిస్టెంట్, స్కిల్ డెవలప్ మెంట్ , ఎంట్రపెన్యూర్ షిప్ ట్రైనింగ్ , ఆర్ అండ్ డి విభాగాల్లో ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవడానికి అవసరమైన అకాడమిక్ సౌకర్యాన్ని PSG విద్యాసంస్థ అందిస్తుంది. ఇందుకు అవసరమైన ఆర్థిక సహాయాన్ని తెలంగాణ ప్రభుత్వం సమకూర్చుతుంది. కళాశాలలోని సెంటర్ ఫర్ ఎక్స్ లెన్స్ ను సందర్శించిన మంత్రి కేటీఆర్, అక్కడి విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. సాంకేతిక శాస్త్రాలను చదువుతున్న విద్యార్థులు వినూత్నమైన ఆలోచనలతో ఎంట్రపెన్యూర్ షిప్ వైపు వెళ్లాలని సూచించారు. తమ పరిశోధనలతో PSG విద్యార్థులు టెక్స్ టైల్ రంగంపై ఆధారపడిన లక్షలాది కార్మికుల దశాబ్దాల సమస్యలను పరిష్కరించేందుకు ప్రయత్నించాలని కోరారు. ఈ ఒక్కరోజు పర్యటనలో మంత్రి తో పాటు పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్, డైరెక్టర్ ఆఫ్ హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్ టైల్స్ శైలజా రామయ్యర్ లు పాల్గొన్నారు.

- Advertisement -