పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు వివేక్ రంజన్ అగ్నిహోత్రి . బెంగాల్ గడ్డపై తనను అడుగు పెట్టనివ్వకుండా ప్రభుత్వం అడ్డుకుంటోందని ఆయన ఆరోపించారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన, తన పట్ల బెంగాల్ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నన్ను పశ్చిమ బెంగాల్‌లోకి రాకుండా అడ్డుకున్నారు. ఆమె నన్ను ఆ రాష్ట్రం నుండి బహిష్కరించారు” అని వివేక్ అగ్నిహోత్రి పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో ఒక పౌరుడిని, కళాకారుడిని ఒక రాష్ట్రంలోకి రాకుండా నిరోధించడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు.
తాను దర్శకత్వం వహించిన ‘ది కశ్మీర్ ఫైల్స్’ సినిమాను కూడా బెంగాల్‌లో ప్రదర్శించకుండా మమతా బెనర్జీ ప్రభుత్వం అడ్డుకుందని వివేక్ గుర్తు చేశారు. అప్పట్లో ఈ సినిమాపై బెంగాల్ ప్రభుత్వం నిషేధం విధించడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. ఆ సినిమా కశ్మీరీ పండిట్ల మారణకాండను చూపిస్తుందని, అది సమాజంలో ఉద్రిక్తతలకు దారితీస్తుందన్న నెపంతో ప్రభుత్వం ఆంక్షలు విధించిందని ఆయన మండిపడ్డారు.
ప్రస్తుతం వివేక్ అగ్నిహోత్రి బెంగాల్ చరిత్రలోని చీకటి కోణాలను వెలికితీస్తూ ‘ది బెంగాల్ ఫైల్స్’ (గతంలో ‘ది ఢిల్లీ ఫైల్స్’) అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన పనుల కోసం కోల్‌కతా వెళ్లినప్పుడు కూడా ట్రైలర్ లాంచ్ ఈవెంట్లను ప్రభుత్వం అడ్డుకుందని, హోటల్ విద్యుత్ కనెక్షన్లు కట్ చేయడం వంటి ఆటంకాలు సృష్టించారని ఆయన ఆరోపించారు.
Also Read:టీవీకే విజయం చారిత్రాత్మకం:సంతోష్
బెంగాల్ ఒకప్పుడు కళలకు, సంస్కృతికి నిలయమని, కానీ ప్రస్తుత పాలనలో అక్కడ స్వేచ్ఛ కరువైందని వివేక్ అగ్నిహోత్రి విమర్శించారు. ఈ పరిణామాలపై అటు తృణమూల్ కాంగ్రెస్ (TMC) శ్రేణులు మాత్రం.. వివేక్ కావాలనే విద్వేషాలను రేకెత్తించేలా సినిమాలు తీస్తున్నారని ప్రత్యారోపణలు చేస్తున్నాయి.

