రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఫౌజీ’ (వర్కింగ్ టైటిల్) సెట్స్‌లో తీవ్ర విషాదం నెలకొంది. చిత్ర షూటింగ్‌కు సంబంధించి ప్రయాణిస్తున్న ఒక ప్రొడక్షన్ వాహనం ప్రమాదానికి గురవడంతో ఒకరు ప్రాణాలు కోల్పోయారు.
రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. చిత్ర ప్రొడక్షన్ యూనియన్‌కు చెందిన సిబ్బంది షూటింగ్ లొకేషన్‌కు వెళ్తుండగా, వారు ప్రయాణిస్తున్న వాహనం నియంత్రణ కోల్పోయి ప్రమాదానికి గురైంది. ఈ దుర్ఘటనలో ప్రొడక్షన్ యూనియన్‌కు చెందిన ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా, వాహనంలో ఉన్న మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు.
స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, గాయపడిన వారిని వెంటనే చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి అత్యవసర చికిత్స అందుతోంది. మృతుడి వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసిన అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ పీరియడ్ యాక్షన్ డ్రామాను మైత్రీ మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో సాగే ఈ కథలో ప్రభాస్ ఒక సైనికుడిగా కనిపిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ పరిసరాల్లో ఈ చిత్రానికి సంబంధించి కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.
Also Read:టీవీకే విజయం చారిత్రాత్మకం:సంతోష్
షూటింగ్ సమయంలో ఇలాంటి విషాదకర సంఘటన జరగడంతో చిత్ర యూనిట్ దిగ్భ్రాంతికి గురైంది. మృతుడి కుటుంబానికి చిత్ర బృందం మరియు అభిమానులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

