విటమిన్ డి అనేది మన శరీరంలో ఎంతో ముఖ్యమైనది. రోగ నిరోధక శక్తిని పెంచడంలోనూ, ఎముకలను దృఢంగా మార్చడంలోనూ, కండరాలను బలపరచడంలోనూ విటమిన్ డి ముఖ్య పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా మనం తినే ఆహారంలో ఉండే కాల్షియం శోషణం జరగాలంటే విటమిన్ డి చాలా అవసరం. ఒకవేళ ఇది లోపిస్తే ఎన్నో ఆరోగ్య సమస్యలు చుట్టుముడతాయి. విటమిన్ డి లోపం ఉన్న వారిలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. తద్వారా తరచూ జబ్బు పడతారు. కొద్దిపాటి పని చేయడానికి కూడా విపరీతంగా అలసిపోతారు. కండరాల నొప్పి, ఎముకల నొప్పి ఇలా చాలా సమస్యలే వేధిస్తాయి. ఇంకా విటమిన్ డి లోపం ఉన్నవారిలో నిద్రలేమి తీవ్రంగా వేధిస్తుంది. కాబట్టి మన శరీరానికి సరైన మోతాదులో విటమిన్ డి అందించడం చాలా అవసరం. .
సాధారణంగా విటమిన్ డి సూర్యరశ్మి నుంచి లభిస్తుంది. అందుకే ప్రతిరోజూ ఉదయం గంట లేదా అరగంట సూర్యరశ్మిలో ఉండాలని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. అయితే ఈ చలికాలంలో సూర్యరశ్మి తక్కువగా ఉంటుంది. అందువల్ల తినే ఆహారంలో కూడా విటమిన్ డి ఉండేలా చూసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వివిధ రకాల ఆహార పదార్థాలలో కూడా విటమిన్ డి పుష్కలంగా లభిస్తుంది. ముఖ్యంగా చేపలు, రొయ్యలు వంటి వాటిలో విటమిన్ డి అధికంగా ఉంటుంది. కాబట్టి వింటర్ లో వీటిని ఆహార డైట్ లో చేర్చుకోవాలి. ఇంకా పుట్టగొడుగుల్లో కూడా విటమిన్ డి ఉంటుంది. వీటిలో ఉండే ప్రోటీన్, బీటా కెరోటిన్, వంటివి విటమిన్ డి లోపాన్ని అడ్డుకుంటాయి. ఇంకా పాల పదార్థాలు, సోయా, బాదం, నారింజ పండ్లు వంటి ఆహార పదార్థాలలో కూడా విటమిన్ డి ఉంటుంది. కాబట్టి చలికాలంలో విటమిన్ డి లోపించకుండా వీటిని ఆహార డైట్ లో చేర్చుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
Also Read:వింటర్ లో నిమ్మరసం తాగితే ఎన్ని ప్రయోజనాలో..?