బీజేపీ నేతపై మండిపడ్డ హీరో విశాల్‌

208
- Advertisement -

నడిగర్‌ సంఘం అధ్యక్షుడు, నటుడు విశాల్‌ రియల్ హీరోగా మారి విప్లవాత్మకమైన మార్పులకు నాంది పలుకుతున్నాడు. నిర్మాతల మండలి అధ్యక్షుడయ్యాక ఒక యాక్షన్ టీంను ఏర్పాటు చేసి పైరసీని ఆపేందుకు తన వంతు ప్రయత్నం చేస్తున్నాడు విశాల్. పైరసీ మాటెత్తితే అతడికి మండిపోతుంది. ఏ హీరో సినిమా అయినా సరే, పైరసీకి సంబంధించిన చిన్నపాటి సమాచారం అందినా, తన కళ్లలో పడినా వెంటనే యాక్షన్‌లోకి దిగిపోతున్నాడు విశాల్. గతంలో పైరసీ సీడీల విక్రయాలకు నిలయమైన చెన్నై బర్మాబజార్‌లోను, సినిమా షూటింగ్‌ కోసం వెళ్లిన కారైకుడిలోను పైరసీ సీడీల విక్రయాన్ని ఎంతో ధైర్యంగా విశాల్‌ అడ్డుకున్నారు.

Vishal slams BJP leader H Raja for watching Vijay's film online

ఇలాంటి తరుణంలో భారతీయ జనతా పార్టీ తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడు హెచ్.రాజా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను మెర్శల్ సినిమా పైరసీలో చూశానని.. అందులోని డైలాగులు జీఎస్టీకి వ్యతిరేకంగా ఉన్నాయని అన్నాడు. రాజా చేసిన వ్యాఖ్యలపై విశాల్‌ స్పందిస్తూ.. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి.. ఒక జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండి.. పైరసీ చూశానని చెబుతున్నారు సిగ్గు లేదా అంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తాడు విశాల్. తక్షణమే రాజా క్షమాపణలు చెప్పాలని విశాల్ డిమాండ్ చేశాడు.

మరోవైపు సీనియర్ హీరో పార్తీబన్ మరి కొందరు తమిళ సినీ ప్రముఖులు కూడా రాజా వ్యాఖ్యల్ని తప్పుబట్టారు. ‘మెర్శల్’ సినిమాలో జీఎస్టీకి వ్యతిరేకంగా డైలాగులు పెట్టడంపై భారతీయ జనతా పార్టీ నేతలు తీవ్రంగా వ్యతిరేకించిన విషయం తెలిసిందే. ఐతే ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత సిద్దార్థ్ మణి మాత్రం ‘మెర్శల్’ సినిమాలో జీఎస్టీకి వ్యతిరేకంగా డైలాగులు పెట్టడం తప్పేమీ కాదంటూ ఆశ్చర్యకర వ్యాఖ్యలు చేశాడు. అది ఆ చిత్ర బృందం అభిప్రాయమని.. దీన్ని పెద్ద వివాదం చేసి పార్టీకి ఆపాదించారని ఆయన అన్నారు.

- Advertisement -