వీరేంద్ర సెహ్వాగ్ భారత క్రికెట్ జట్టులో 14 ఏళ్ల పాటు క్రికెట్ మైదానంలో తనదైన శైలిలో అలరించాడు. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తెందుల్కర్‌తో కలిసి ఓపెనర్‌గా బరిలోకి దిగి ఒంటి చేత్తో జట్టుకు విజయాలను అందించాడు. ఆ తర్వాత తనదైన ట్వీట్ షాట్లను సంధిస్తూ అభిమానుల్ని అలరిస్తూనే ఉన్నాడు. ఈ రోజు వీరూ 39వ పుట్టిన రోజును జరుపుకొంటున్నాడు. ఈ సందర్భంగా మాజీ, ప్రస్తుత క్రికెటర్లు, అభిమానుల నుంచి సెహ్వాగ్‌కు సామాజిక మాధ్యమాల ద్వారా శుభాకాంక్షలు వెల్లువెత్తాయి.
1999లో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన సెహ్వాగ్ 104 టెస్టుల్లో 49.34 సగటుతో 8,586 పరుగులు చేయగా 251 వన్డేల్లో 35.05 సగటుతో 8,273 పరుగులు సాధించాడు. 1999లో పాకిస్థాన్‌పై సెహ్వాగ్ వన్డే క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. 2004లో అదే పాకిస్థాన్‌పై టెస్టుల్లో తొలి త్రిశతకాన్ని నమోదు చేశాడు సెహ్వాగ్. భారత్ తరఫున ఈ ఘనత అందుకున్న మొదటి ఆటగాడు సెహ్వాగ్. ఆ తర్వాత 2008లో దక్షిణాఫ్రికాపై సెహ్వాగ్ 319 పరుగులు చేశాడు. 2011లో వెస్టిండీస్‌పై ఇండోర్‌లో జరిగిన వన్డేల్లో ఈ డాషింగ్ ఓపెనర్ 149 బంతుల్లో 219 పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు మన సెహ్వాగ్.