కోహ్లీ విఫలం.. ప్లేఆఫ్‌ కష్టమే..

194
Virat Kohli Failing In The IPL
Virat Kohli Failing In The IPL
- Advertisement -

తొమ్మిది మ్యాచ్‌ల్లో ఆరు ఓడి.. రెండు గెలిచి.. ఒకటి రద్దుతో మొత్తంగా 5 పాయింట్లతో ఉన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఐపీఎల్‌-10లో ప్లేఆఫ్స్‌ తలుపులు దాదాపుగా మూసుకుపోయినట్లే. ఇక మిగతా ఐదు మ్యాచ్‌ల్లో గెలిచినా తర్వాతి దశకు చేరుతుందని కచ్చితంగా చెప్పలేని పరిస్థితి తెచ్చుకుంది. గత టోర్నీలో పరుగుల సునామీ సృష్టించిన కోహ్లి ఈసారి చెప్పుకోదగ్గ ప్రదర్శనేమీ చేయలేదు. గురువారం జరిగిన మ్యాచ్‌లో లయన్స్‌ 7 వికెట్ల తేడాతో బెంగళూరును ఓడించింది గుజరాత్‌ లయన్స్‌. ఆండ్రూ టై (3/12), జడేజా (2/28) ధాటికి మొదట బెంగళూరు 134 పరుగులకే పరిమితమైంది. ఫించ్‌ వీరవిహారం చేయడంతో లక్ష్యాన్ని గుజరాత్‌ కేవలం 13.5 ఓవర్లలో 3 వికెట్లే కోల్పోయి ఛేదించింది.

135 పరుగుల ఛేదనలో గుజరాత్‌ ఆరంభంలో 23 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో పడింది. ఆ స్థితిలో క్రీజులోకొచ్చిన ఫించ్‌ దుమ్మురేపాడు. తానాడిన తొలి ఓవర్లోనే రెండు సిక్స్‌లు బాదిన ఫించ్‌.. ఆ తర్వాత ఏ బౌలర్‌ను వదలకుండా ఉతికిపారేశాడు. అంకిత్‌ చౌదరి వేసిన తొమ్మిదో ఓవర్లో 19 పరుగులు రాబట్టాడు ఫించ్‌. ఫించ్‌ 22 బంతుల్లోనే అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇన్నింగ్స్‌ త్వరగా ముగించేయలనుకున్న ఫించ్‌… స్వీప్‌, రివర్స్‌ స్వీప్‌, స్విచ్‌ హిట్‌ లాంటి షాట్లతో పరుగులు సాధించాడు. రైనా (34 నాటౌట్‌; 30 బంతుల్లో 4×4, 1×6) నెమ్మదిగా ఆడినా… నేగి బౌలింగ్‌లో వరుసగా రెండు బంతుల్ని స్టాండ్స్‌లోకి కొట్టిన ఫించ్‌ మ్యాచ్‌ను గుజరాత్‌ చేతుల్లోకి తీసుకున్నాడు. ఆ తరువాత ఫించ్ ఔటనప్పటికీ.. అప్పటికే గుజరాత్‌ గెలుపు కన్‌ఫామ్ అయింది.

gl vs rcb

అంతకుముందు టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు.. తొలి ఓవర్లో మూడు పరుగులే చేసింది. విరాట్‌తో పాటు గేల్‌ (8) క్రీజులో ఉన్నా స్కోరు కదల్లేదు. నాలుగు ఓవర్లకు ఆర్‌సీబీ చేసిన పరుగులు 22 మాత్రమే. కోహ్లి (10) మరోసారి నిరాశపరిచాడు. ఈ ఐపీఎల్‌లో పొదుపుగా, పదునుగా బౌలింగ్‌ చేస్తున్న పేసర్‌ ఆండ్రూ టై.. గేల్‌, హెడ్‌ (0)లను వరుస బంతుల్లో ఔట్‌ చేసి హ్యాట్రిక్‌ మీద నిలిచాడు. కేదార్‌ జాదవ్‌.. టై హ్యాట్రిక్‌ ప్రయత్నాన్ని అడ్డుకున్నాడు. ఆ తర్వాత ఓవర్లో జాదవ్‌ (31; 18 బంతుల్లో 4×4, 1×6) హ్యాట్రిక్‌ ఫోర్లు కొట్టి ఆర్‌సీబీలో ఉత్సాహాన్ని నింపాడు. అంతలోనే మళ్లీ ఆర్‌సీబీ కష్టాల్లో పడింది. మొదట జాదవ్‌ను బౌల్డ్‌ చేసిన జడేజా.. ఆ తర్వాత ఓవర్లో మెరుపు ఫీల్డింగ్‌తో ఏబీని రనౌట్‌ చేశాడు. దీంతో 60 పరుగులకే 5 కీలక వికెట్లు కోల్పోయింది బెంగళూరు.. ఈ స్థితిలో ధాటిగా ఆడిన పవన్‌ నేగి (32; 19 బంతుల్లో 3×4, 2×6) స్కోరు 100 పరుగులు దాటించాడు. కానీ 14వ ఓవర్లో నేగి ఔటవడంతో బెంగళూరు పరుగుల వేగం తగ్గి.. చివరి ఆరు ఓవరల్లో 34 పరుగులు చేయగలిగింది బెంగళూరు.

- Advertisement -