రైతులకు అండగా కేసీఆర్

220
- Advertisement -

స్వరాష్ట్ర ఆకాంక్షను నెరవేర్చి తొలి గమ్యాన్ని ముద్దాడామని సీఎం కేసీఆర్ తెలిపారు. వరంగల్‌ జిల్లా ప్రకాశ్ రెడ్డిపేటలో జరిగిన  ప్రగతి నివేదన మహాసభలో మాట్లాడిన సీఎం కేసీఆర్ ఓరుగల్లు పోరుగల్లని  తెలిపారు. ప్రజల మద్దతు ఉన్నంత కాలం ప్రాణం పోయిన అభివృద్ధిని ఆగనీయమని చెప్పారు.స్వరాష్ట్రం వచ్చిన తర్వాత జరిగిన ప్రతి ఎన్నికలో ప్రజలు టీఆర్ఎస్‌కే పట్టం కట్టారని గుర్తుచేశారు. 2019లో టీఆర్ఎస్‌దే అధికారమని స్పష్టం చేశారు.

వరంగల్‌లో జరిగిన ప్రతిసభలో ప్రొ జయశంకర్ గారు మాట్లాడిన తర్వాత నేను మాట్లాడేవాడినని కానీ ఆయన మన మధ్య లేకపోవడం బాధకరమన్నారు. ఆయన ఆత్మకు శాంతిచేకూరాలన్నారు. టీఆర్ఎస్ పార్టీపై అవాకులు చవాకులు పేలిన వారు అడ్రస్ లేకుండా పోయిండ్రు కానీ టీఆర్ఎస్ పోలేదన్నారు. టీఆర్ఎస్ ఆవిర్భావ సభను విజయవంతం చేసిన ఘనత పార్టీ శ్రేణులదేనని తెలిపారు.

భారతదేశంలోనే ఇంతగొప్పగా సభ పెట్టేందుకు ఏపార్టీ కూడా ధైర్యం చేయదన్నారు. రాష్ట్రాన్ని సాధించి తొలి గమ్యాన్ని ముద్దాడామని…సాధించుకున్న రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మారుస్తామని చెప్పారు. ఎండలు లెక్కచేయకుండా సభకు వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. సమైక్య రాష్ట్రంలో జరిగిన జీవన విధ్వంసం రైతుల ఆత్మహత్యలు,చేనేత కార్మికుల ఆకలిచావులతో అల్లాడిపోయామని తెలిపారు. కానీ తెలంగాణ వచ్చినంకా కనురెప్పపాటు కూడా కరెంట్ పోకుండా చూశామని తెలిపారు.

పవర్ హలీడేలు లేవని… పంటలు బాగా పండాయని తెలిపారు. సంక్షేమానికి పెద్దపీట వేశామన్న కేసీఆర్  ఏటా రూ. 40వేల కోట్లు ఖర్చుచేస్తున్నామని వెల్లడించారు. వలసపోయిన తెలంగాణ బిడ్డలు తిరిగిరావాలన్నారు. గ్రామీణ ఆర్ధిక వ్యవస్థ పటిష్టం కావాలని…అభివృద్ధిలో తెలంగాణ దూసుకుపోతుందని చెప్పారు.

గొర్రెల పంపిణీతో యాదవ సోదరులకు అండగా నిలిచామని.. ఈ పథకంలో పైరవీలు,లంచాలు ఉండవన్నారు. నాయి బ్రహ్మాణల కోసం 25వేల నవీన క్షౌర శాలలు ఏర్పాటుచేస్తున్నామని తెలిపారు. కులవృత్తులను అన్నివిధాలుగా ప్రభుత్వం ఆదుకుంటుందని స్పష్టం చేశారు. గీతన్నల తలరాతలు మారాని … కల్తీ కల్లు పోయి మంచి కల్లు రావాలని చెప్పారు. మూతపడిన కల్లు దుకాణాలను తెరిపించామన్నారు.

భవిష్యతులో ఎరువులు,విత్తనాల కొరత రాకుండా చూస్తామన్నారు. 17 లక్షల మెట్రిక్ టన్నుల గోదాంల నిర్మాణం పూర్తవుతుందని తెలిపారు. మిషన్ కాకతీయ ద్వారా చెరువులను బాగుచేసుకున్నామని.. మత్య్స పరిశ్రమను బ్రహ్మాండంగా అభివృద్ది చేసుకున్నామని వెల్లడించారు.

భారతదేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా రూ.17వేల కోట్ల రుణమాఫీ చేశామన్నారు. దేశంలోనే ధనిక రైతులు తెలంగాణలో ఉండేవిధంగా చూస్తామని ….పంటలను క్రాప్ కాలనీలుగా మారుస్తామన్నారు. మనం పండించే పంటకు మనమే ధర నిర్ణయించే పరిస్ధితి రావాలన్నారు. ఎకరానికి 4వేల చొప్పున రెండు పంటలకు ప్రభుత్వం నిధులు సమకూరుస్తుందని చెప్పారు.

కాంగ్రెస్ నేతలు పదవుల కోసం తెలంగాణను ఆగం చేశారని…వలసలకు కారణం ఈ సన్నాసులేనని మండిపడ్డారు. తెలంగాణ సమస్యలపై ఏనాడు మాట్లాడలేదని…ఇవాళ నీళ్లు రాకుండా అడ్డుకున్నారని వారిని నిలదీయాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. తెలంగాణకు జరిగిన అన్యాయంపై ఒక్కమాట కూడా మాట్లాడలేదన్నారు. తెలంగాణ ప్రజానీకం కాంగ్రెస్ నాయకులను ప్రశ్నించాలన్నారు. ఇంత ఎండలో సభను విజయవంతం చేసిన వారందరికి కృతజ్ఞతలు తెలిపారు సీఎం.

- Advertisement -