తెలంగాణ పెట్టుబడులకు అనుకూలం: వినోద్ కుమార్‌

147
vinod kumar
- Advertisement -

పెట్టుబడులకు తెలంగాణ అనువైన రాష్ట్రం అన్నారు రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు వినోద్ కుమార్‌. కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ (రాష్ట్రాలు) ఓ.ఎస్.డీ. రాజశేఖర్‌తో వినోద్ కుమార్ బుధవారం ఢిల్లీలో సమావేశమయ్యారు. ఈ భేటీలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అనేక అంశాలు వారి మధ్య చర్చకు వచ్చాయి.

ఇదివరకు ఇండియన్ ఫారెన్ సర్వీస్ (ఐ.ఎఫ్.ఎస్) అధికారులు కేవలం అంతర్జాతీయంగా విదేశాంగ మంత్రిత్వ వ్యవహారాలను మాత్రమే చూస్తుండేవారు.రాష్ట్రాలతో సమన్వయం కోసం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రత్యేకంగా విభాగాన్ని ఏర్పాటు చేయగా, సీనియర్ ఇండియన్ ఫారెన్ సర్వీస్ అధికారి అయిన తెలంగాణ రాష్ట్రానికి చెందిన నల్లగొండ జిల్లా బిడ్డ సీ. రాజశేఖర్ రాష్ట్రాల సమన్వయం కోసం ఓ.ఎస్.డీ. గా నియమితులయ్యారు.ఈ విభాగం దేశంలోని 29 రాష్ట్రాలకు చెందిన వివిధ అంశాల పరిష్కారానికి సమన్వయం చేస్తుంది.

ఈ సందర్భంగా వినోద్ కుమార్ మాట్లాడుతూ…తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న విద్యుత్ సరఫరా, నీళ్లు, వ్యవసాయ రంగ ప్రగతి, ఐ.టీ. రంగంలో సాధించిన విజయాలు, రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి స్థిరంగా ఉండటం, న్యాయ స్థానాల్లో కేసుల సత్వర పరిష్కారానికి ప్రత్యేక కోర్టుల ఏర్పాటు, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో దేశంలోనే తెలంగాణ ముందు వరుసలో ఉండటం వంటి అంశాలను వినోద్ కుమార్ వివరించారు.

తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్ పెట్టుబడులకు అనువైన ప్రాంతాలని పేర్కొన్నారు. దేశంలో పర్యటించే విదేశీ టూరిస్ట్ లు తెలంగాణ రాష్ట్రంలో పర్యటించే విధంగా చొరవ చూపాలని వినోద్ కుమార్ కోరారు.తెలంగాణ రాష్ట్రంలో అనేక చారిత్రక కట్టడాలు, ప్రదేశాలు, అడవులు, జలపాతాలు, వన్యప్రాణులు ఉన్న విషయాన్ని వినోద్ కుమార్ ఓ.ఎస్.డీ. రాజశేఖర్ దృష్టికి తీసుకొచ్చారు.

రాష్ట్ర పర్యటనకు రావాలని, హైదరాబాద్ లో నిర్వహించనున్న ఉన్నత స్థాయి సమావేశంలో పాల్గొనాల్సిందిగా రాజశేఖర్ ను వినోద్ కుమార్ ఆహ్వానించారు.రాష్ట్రంలో విదేశీ పెట్టుబడులు పెరిగేందుకు, విదేశాలలో రాష్ట్ర అంశాల పరిష్కారాలపై రాజశేఖర్ తో జరిగిన సమావేశం ద్వారా భరోసా కలిగిందని, ఈ భేటీ పట్ల వినోద్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు.

- Advertisement -