రాష్ట్ర విభజన జరిగి ఎనమిదేళ్లు పూర్తి కావొస్తున్న ఇంకా పారిశ్రామిక ట్రిబ్యునల్ కం లేబర్ కోర్టు విభజన జరగకపోవడం వల్ల కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు వినోద్ కుమార్. కార్మిక సంఘాల నాయకులు, ప్రతినిధులు మంత్రుల నివాస సముదాయంలో వినోద్ కుమార్‌తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా మాట్లాడిన వినోద్ కుమార్..కేంద్ర ప్రభుత్వ కార్మికశాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో ఉమ్మడిగా ఉన్న పారిశ్రామిక ట్రిబ్యునల్ కం లేబర్ కోర్టును తక్షణమే విభజించాలని డిమాండ్ చేశారు. ఈ కోర్టు విభజన జరగకపోవడం వల్ల లెక్కలేనన్ని కేసులు సత్వర పరిష్కారానికి నోచుకోకుండా కార్మిక వర్గాలు ఇబ్బందులు పడుతున్నాయని వెల్లడించారు.
ఉమ్మడిగా ఉన్న పారిశ్రామిక ట్రిబ్యునల్ కం లేబర్ కోర్టును తక్షణమే విభజించాలని, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు వేర్వేరుగా ఈ కోర్టులు ఉండేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ చేశారు.