బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కి లేఖ రాశారు మంత్రి కేటీఆర్. నేతన్నల సంక్షేమం పట్ల తెలంగాణ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని బండి చేసిన ఆరోపణలు ఆయన అజ్క్షానానికి నిదర్శనమన్నారు. నేతన్నలకు బీమాను ఎత్తేసిన కేంద్రంపై బండి మాట్లాడాలని డిమాండ్ చేశారు. కేంద్రం బీమా ఎత్తేస్తే… మేం ప్రత్యేక బీమా కల్పిస్తున్నామని చురకలు అంటించారు? చేనేతపై తొలిసారి పన్ను వేసిన పాపపు ప్రభుత్వం బీజేపీదేనని ఆగ్రహం వ్యక్తం చేశారు.
బండి సంజయ్ చెప్పిన మాటలు అతడి అజ్ఞానం, అమాయకత్వం, మూర్ఖత్వానికి నిదర్శనంగా ఉన్నాయని ధ్వజమెత్తారు. దశాబ్దాలుగా నేతన్నల సంక్షేమం కోసం దేశంలో ఏ రాష్ట్రం, ఏ ప్రభుత్వం చేపట్టని స్థాయిలో విప్లవాత్మకమైన కార్యక్రమాలను సీఎం కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ సర్కారు చేపట్టిందని ఆయన పేర్కొన్నారు.
టెక్స్ టైల్ పరిశ్రమను అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అభివృద్ది చేసేందుకు దేశంలోనే అతిపెద్దదైన కాకతీయ టెక్స్ టైల్ పార్కు ఏర్పాటుతోపాటు అనేక మౌలిక వసతులను అభివృద్ది చేస్తున్నామన్నారు.బండి సంజయ్ మళ్లీ నేతన్నలకు పాతరోజులు రావాలని కోరుకుంటున్నారని కేటీఆర్ విమర్శించారు. బండి సంజయ్ పాదయాత్ర పేరుతో అబద్ధాలు ప్రచారం చేస్తూ ప్రజలపై దండయాత్ర చేస్తున్నాడని ధ్వజమెత్తారు.

