ప్రముఖ నటీ,సీనియర్ హీరోయిన్, లేడీ అమితాబ్ విజయశాంతి వైవిధ్యమైన సినిమాల్లో చేసి తనకంటూ ప్రత్యేకగుర్తింపు తెచ్చుకుంది. పలు సినిమాల్లో హీరోయిన్ గా చేస్తూ లేడీ ఓరియెంటెడ్ మూవీల్లో నటించింది. విజయశాంతి సినిమాల్లో మనకు బాగా గుర్తిండిపోయే సినిమా కర్తవ్యం. ఈమూవీ విజయశాంతికి మంచి విజయాన్ని అందించింది. ఈచిత్రంలో విజయశాంతి సీనియర్ పోలీస్ ఆఫీసర్ గా నటించారు. కాగా ఈమూవీ విడుదలై నేటికి 30ఏండ్లు అవుతుంది.
కర్తవ్యం సినిమా 1990జూన్ 29న విడుదలైంది. మోహన్ గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈచిత్రాన్ని ఎ.ఎం. రత్నం నిర్మించారు. పరుచూరి బ్రదర్స్ ఈసినిమాకు కథను అందించారు. ఓ నగరంలో అన్యాయాలు, అక్రమాలు చేసే రాజకీయ నాయకుడు ముద్దుకృష్ణయ్యకు, సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ వైజయంతీకి మధ్య జరిగే పోరాటమే కర్తవ్యం కథ . ఈసినిమా కలెక్షన్ల పరంగా బాక్సాఫిస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టింది.
1990 అక్టోబర్ 7న మ్రదాస్ విజయా మహాల్‌లో చిత్రం వంద రోజుల వేడుకను చేశారు. ఈ వేడుకకి ఐపీయస్ ఆఫీసర్ కిరణ్ బేడీతో పాటు నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ చిత్రానికి గాను విజయశాంతికి జాతీయ ఉత్తమ నటి అవార్డు దక్కింది. ఈసినిమాకు రాజ్ కోటీ సంగీతం అందించగా సాయి కుమార్, బాబుమోహన్ , పరుచూరి వెంకటేశ్వర్ రావు, నిర్మలమ్మలు ప్రధాన పాత్రల్లో నటించారు.