తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుపై సందిగ్ధత కొనసాగుతోంది. తమిళగ వెట్రి కజగం (TVK) అధ్యక్షుడు విజయ్ సమర్పించిన ఎమ్మెల్యేల సంఖ్యాబలంపై గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ ఇంకా పూర్తి సంతృప్తి చెందలేదు. దీంతో విజయ్‌ను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించడం లేదా ప్రమాణ స్వీకార వేడుకపై గవర్నర్ ఇంకా ఎటువంటి తుది నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. మరోసారి గవర్నర్ తో భేటీ అయ్యారు విజయ్.
మెజారిటీ మార్కును దాటేందుకు అవసరమైన మద్దతును కూడగట్టే ప్రయత్నాల్లో విజయ్ నిమగ్నమై ఉన్నందున, గురువారం ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం లేదని సమాచారం. 234 స్థానాలున్న తమిళనాడు అసెంబ్లీలో టీవీకే 108 స్థానాలను గెలుచుకుంది. మెజారిటీకి ఇంకా 10 స్థానాలు తక్కువగా ఉంది. విజయ్ తాను గెలిచిన రెండు నియోజకవర్గాల్లో ఒకదానికి రాజీనామా చేయాల్సి ఉండటంతో పార్టీ బలం 107కి తగ్గింది.
గతంలో డీఎంకే కూటమిలో ఉన్న 5గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇప్పుడు టీవీకేకు మద్దతు ప్రకటించారు. వీరితో కలిపి సంఖ్య 112కి చేరుతుంది, కానీ ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన 118 మార్కును ఇంకా అందుకోలేదు.సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన టీవీకేను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించకపోవడంపై కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ మను సింఘ్వీ మండిపడ్డారు. ఇది రాజ్యాంగ విలువల ఉల్లంఘన అని ఆయన విమర్శించారు. కేవలం 7 నుంచి 8 సీట్ల లోటు మాత్రమే ఉందని, సభలో మెజారిటీ నిరూపించుకోవడానికి 10-12 రోజుల సమయం ఇచ్చి విజయ్‌ను ఆహ్వానించాల్సిందని ఆయన అభిప్రాయపడ్డారు.
ప్రభుత్వ ఏర్పాటుపై ధీమాతో టీవీకే నాయకులు, కార్యకర్తలు చెన్నైలోని పార్టీ ప్రధాన కార్యాలయం వద్దకు భారీగా చేరుకుంటున్నారు.చెన్నై నుంచి కన్యాకుమారి వరకు ‘విజయ్ ప్రభంజనం’ వీచింది. ప్రజలు 108 సీట్లతో మాకు తీర్పు ఇచ్చారు. మా నాయకుడు విజయ్ ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతారు, శాశ్వతంగా ఆ పదవిలో కొనసాగుతారు టీవీకే నేత గణేశన్ తెలిపారు.
Also Read:‘ఇంపాక్ట్ ప్లేయర్’..రక్షణ కవచం మాత్రమేనా?

